ప్రతిపక్షం, జూన్ 06: పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. త్వరలోనే 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల కాలంలో 67,760 ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకే ప్రభుత్వ హయాంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడం అరుదైన విషయమని పేర్కొన్నారు.
నియామక ప్రక్రియలో పూర్తిస్థాయి పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రజా సేవల నియామక వ్యవస్థలో జాతీయ స్థాయి ప్రమాణాలను అమలు చేస్తున్నామని వివరించారు. అర్హత, ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
త్వరలో విడుదల కానున్న పోలీసు ఉద్యోగాల ప్రకటనతో వేలాది మంది అభ్యర్థులకు అవకాశం లభించనుందని, నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.















