*ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని రైతులకు సూచన.
చండూరు మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ .
ప్రతి పక్షం చండూరు, అక్టోబర్ 06: చండూరు మండలం బోడంగిపర్తి గ్రామపంచాయతీ పరిధిలోని కుమ్మందాని గూడెం గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో పత్తి పంట సమగ్ర యాజమాన్య పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, పప్పు ధాన్యాల సాగుపై పొలంబడి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. మట్టి పరీక్షలు చేయించుకునే విధానం, విత్తన శుద్ధి చేయు విధానం గురించి రైతులకు క్షుణ్ణంగా వివరించారు. పత్తి, వరి పంటలే కాకుండా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న వంటి పంటలు కూడా పండించాలని సూచించారు.
అంతర పంటలుగా కంది, దోస, ఇతర కూరగాయలు వేసుకోవడం వల్ల అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. రైతులు రసాయన ఎరువులు, పురుగు మందులను తక్కువ మోతాదులో వాడాలని, సేంద్రియ ఎరువులను అలవాటు చేసుకోవాలని కోరారు. కొద్దిమంది రైతులైనా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు.
పంట పొలాల్లో హాని చేయని మిత్ర పురుగులైన సాలెపురుగులు, లేడీ బగ్, అక్షింతల పురుగులు, మాంటెడ్, ట్రైకోగామా వంటి పురుగులను సంరక్షించుకోవాలని, ఇవి పంటకు హాని కలిగించే కీటకాలను తిని రైతులకు మేలు చేస్తాయని వివరించారు. పంట పొలంలో అక్కడక్కడ టీ ఆకారపు కర్రలు ఉంచడం వల్ల పక్షులు వాటిపై కూర్చొని లద్దె పురుగులు, శనగపచ్చ పురుగులు, ఇతర పురుగుల లార్వాలను తినివేస్తాయని, దీనివల్ల పురుగు మందుల వాడకం తగ్గుతుందని తెలియజేశారు.సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతు జక్కల వెంకటేష్ మాట్లాడుతూ ఆవు మూత్రం ద్వారా కషాయాలు తయారు చేసుకుని పురుగు మందులకు బదులు వాటిని వాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మల సుగుణమ్మ శంకర్, వ్యవసాయ విస్తరణాధికారి పి. పవన్, బీటీఎం మునుగోడు రమేష్, రైతులు వి. శ్రవణ్, కె. యాదయ్య, వి. శంకర్ తదితరులు పాల్గొన్నారు.






























