23 నుండి 29 వరకు చైతన్య యాత్రలు.
ప్రతిపక్షం. నిజామాబాద్. నవంబర్ 17: మంగళవారం రోజున నిజామాబాద్ లో వినియోగదారుల ప్రతినిధుల సమావేశం జరిగింది. నేటి సమావేశానికి గౌ. అతిధిగా సి.సి.ఐ జాతీయ సీనియర్ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి హాజరయ్యారు. వినియోగదారుల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్, మండలి నిజామాబాద్ జోనల్ కమిటీ కన్వీనర్ సందు ప్రవీణ్, వినియోగదారుల ట్రస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వి.యన్. వర్మ తదితరులు ప్రతినిధుల సమావేశంలో అధ్యక్షత వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బహిరంగ మార్కెట్లలో పెరిగిపోతున్న మోసాలను అరికట్టడానికి వినియోగదారులు చైతన్యం ఒక్కటే సరైన ఆయుధమని ఈ సందర్భంగా సాంబరాజు చక్రపాణి తెలిపారు.
చైతన్యానికి ప్రారంభం మహిళల ద్వారానే సాధ్యమవుతుందని కాబట్టి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, చదువుకున్న అమ్మాయిల ద్వారా కాలేజీ స్థాయిలలో చైతన్య కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నట్లు సాంబరాజు చక్రపాణి తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన రాష్ట్ర, జిల్లా ప్రతినిధుల తీర్మాణం మేరకు ఈనెల నవంబర్ 23 నుంచి 29 వరకు “వినియోగదారుల హక్కులు మహిళా చైతన్యం” అంశంపై చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నట్లు ప్రకటించారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019, లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011, జీఎస్టీ యాక్ట్, సేల్స్ గూడ్స్ యాక్ట్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రూల్స్ 2020 లపై వివిధ వ్యాపార వర్గాలకు కూడా చైతన్యం కలిగించనున్నట్లు వినియోగదారుల ప్రతినిధులు తెలిపారు. రసీదు లేని జీరో వ్యాపారం వల్ల వినియోగ హక్కుల పరిరక్షణ సాధ్యం కాదు కాబట్టి, జిఎస్టి యాక్ట్ నిబంధనల గురించి విస్తృత ప్రచారం చేయనున్నట్లు నిజామాబాద్ జోనల్ కన్వీనర్ సందు ప్రవీణ్ తెలిపారు.
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆహార కల్తీ సమస్యలు విజృంభిస్తున్న తరుణంలో వినియోగదారుల ప్రతినిధులు కలిసి టెస్ట్ చెక్ లు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.బంగారు వెండి ఆభరణాల్లో సాంకేతికపరంగా మోసాలు అరికట్టలేని పరిస్థితి పై చైతన్య కార్యక్రమాల ఆవశ్యకత ఉన్నందున బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) క్రియాశీలక పాత్ర వహించాలని రాష్ట ప్రధాన కార్యదర్శి అందె శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకే తెలంగాణ రాష్ట్రంలోనే వివిధ వినియోగదారుల కమిషన్లలో పిర్యాదులను దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.




























