నర్మెట జెడ్పీహెచ్ఎస్లో ఘనంగా పదో తరగతి గ్రాడ్యుయేషన్ వేడుకలు
74 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం..
జిల్లా టాపర్ అమూల్యారెడ్డికి రూ.10వేల నగదు బహుమతి
ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 24: విద్యార్థుల జీవితంలో పదో తరగతి కీలక మలుపు. ఈ దశలో సాధించే విజయం భవిష్యత్తు లక్ష్యాలకు పునాది కావాలి. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యాశాఖ అధికారులు, విద్యావేత్తలు సూచించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారి విజయాలను అభినందించే విధంగా సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పదో తరగతి గ్రాడ్యుయేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 74 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. పదో తరగతిలో 587 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచిన రేకులపల్లి అమూల్యా రెడ్డికి నగదు బహుమతి అందజేసి ప్రోత్సహించారు.
ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారి తగిరెడ్డి దేశిరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ వేడుకలు పాఠశాలలో పండుగ వాతావరణాన్ని నింపాయి. సిద్ధిపేట జిల్లా సీఈవో, జిల్లా ఇంఛార్జి విద్యాధికారి ఇన్చార్జి సి.రమేశ్, సుచిర్ ఇండియా చైర్మన్ డాక్టర్ కిరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో విద్యకు ఎంతో ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. పాఠ్యాంశాలపై పట్టు సాధించడంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి తనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. దానిని సాధించే దిశగా నిరంతరం కృషి చేయాలని సూచించారు. అపజయాలకు భయపడకుండా వాటిని విజయానికి మెట్లుగా మలుచుకోవాలని హితవు పలికారు. విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. తమ కోసం నిరంతరం శ్రమించే తల్లిదండ్రుల త్యాగాలను గుర్తించాలని చెప్పారు. జీవితానికి సరైన దిశ చూపించే గురువులను గౌరవించాలని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించడంతో పాటు సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. రానున్న పదో తరగతి పరీక్షల్లోనూ ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకు రావాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
సుచిర్ ఇండియా ఆర్థిక సాయంతో విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు
విద్యార్థుల అవసరాలను గుర్తించి పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు సుచిర్ ఇండియా గ్రూప్ ముందుకొచ్చింది. సంస్థ అందించిన రూ.2.25 లక్షల నిధులతో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం మరుగు దొడ్లను నిర్మించారు. వీటిని ముఖ్య అతిథులు ప్రారంభించారు.విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా వారి విద్యాభ్యాసానికి తోడ్పడవచ్చని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల అభివృద్ధికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించడం అభినందనీయమని సిద్ధిపేట జిల్లా పరిషత్ సీఈవో, సిద్ధిపేట జిల్లా ఇంచార్జి విద్యాధికారి సి.రమేశ్ అన్నారు. ముఖ్యంగా దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండటం వారి ఆత్మ గౌరవానికి, సౌకర్య వంతమైన విద్యాభ్యాసానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
74 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం
గత పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన 74 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. విద్యాభ్యాసంలో ఒక ముఖ్యమైన దశను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్లు అందుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అతిథులు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.పదో తరగతి పూర్తవడం విద్యార్థుల విద్యా ప్రయాణంలో ముగింపు కాదని చెప్పారు. ఉన్నత విద్యకు ఇది ఆరంభమని పేర్కొన్నారు. తమ ఆసక్తులు, సామర్థ్యాలకు అనుగుణంగా లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు తమ ప్రతిభతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
జిల్లా టాపర్ అమూల్యా రెడ్డికి రూ.10వేల నగదు బహుమతి
పదో తరగతి పరీక్షల్లో 587 మార్కులు సాధించి సిద్దిపేట జిల్లా టాపర్గా నిలిచిన రేకులపల్లి అమూల్యా రెడ్డిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. సుచిర్ ఇండియా చైర్మన్ డాక్టర్ కిరణ్ ఆమెకు రూ.10వేల నగదు బహుమతిని అందజేశారు. భవిష్యత్తులోనూ ఇదే పట్టుదలతో చదివి ఉన్నత విద్యలో రాణించాలని అభినందించారు. మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రోత్సహించారు. అమూల్యా రెడ్డి సాధించిన విజయం సిద్ధిపేట జిల్లాకు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. ఆమె కృషి తోటి విద్యార్థులకు స్ఫూర్తి దాయకమన్నారు. సరైన లక్ష్యం, క్రమబద్ధమైన ప్రణాళిక, నిరంతర సాధన ఉంటే విద్యలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఈ విజయం నిరూపిస్తోందని అభిప్రాయ పడ్డారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో మరింత ఉత్సాహాన్ని నింపవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, నర్మెట్ట మాజీ ఎంపీటీసీ, అవని దిన పత్రిక సంపాదకుడు కూతురు రాజిరెడ్డి, గ్రామ నాయకులు నాయిని రవీందర్రెడ్డి, ఉప్పాల నారాయణ, ఎం.డి.అజీజ్, శ్రీనివాస్, మాజీ పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ వెంకన్న, ఉపాధ్యాయులు సత్యనారాయణ, కనకయ్య, అనుమాండ్ల జనార్ధన రెడ్డి, ఎం.డి.రఫీక్ విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థుల విజయాలను అభినందిస్తూ, వారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రాడ్యుయేషన్ వేడుకలు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.


































