ఆర్టీసీ సిబ్బందిపై దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్

విధుల్లో ఉన్న డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేస్తే ఉపేక్షించేది లేదు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశం

ప్రతిపక్షం ప్రతినిధిమెదక్, నవంబర్ 29: నర్సాపూర్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ప్రజలకు నిరంతరం రవాణా సేవలు అందించే ఆర్టీసీ సిబ్బందిపై దాడులను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.సంగారెడ్డి నుంచి నర్సాపూర్ మీదుగా గజ్వేల్‌కు వెళ్తున్న TG35Z 0034 నంబర్ గల బస్సును నర్సాపూర్ ఎక్స్‌రోడ్డులోని లక్ష్మీ హోటల్ ఎదుట నిలిపిన సమయంలో మోటార్ సైకిల్‌పై వచ్చిన ఒక వ్యక్తి, ఇద్దరు మహిళలు బస్సును ఢీకొట్టి, అనంతరం డ్రైవర్, కండక్టర్‌పై దాడికి పాల్పడినట్లు మంత్రి దృష్టికి వచ్చింది. ఈ ఘటనలో డ్రైవర్ కె. నరేష్, కండక్టర్ పి. శ్రీకాంత్‌తో పాటు అడ్డుకునేందుకు ప్రయత్నించిన మాజీ కౌన్సిలర్ రాజేందర్, స్థానికులపైనా దాడి చేసినట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై కేసు నమోదైన నేపథ్యంలో నిందితులను గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. విధుల్లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యతని, ఆర్టీసీ సిబ్బంది ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా విధులు నిర్వహించాలని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.

Related News

Latest News