తొమ్మిదేళ్లలో 94.2 కోట్ల ప్రయాణాలు.. పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో

ప్రతిపక్షం, నవంబర్ 28: హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా మారిన మెట్రో రైలు పదో వసంతంలోకి అడుగుపెట్టింది. 2017 నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్ మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. ఆ తర్వాతి రోజు నుంచి దశలవారీగా ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొమ్మిదేళ్ల ప్రయాణంలో మెట్రో అనేక మైలురాళ్లను అధిగమించింది. నగరంలోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ సమస్యలను కొంతవరకు తగ్గిస్తూ లక్షలాది మందికి వేగవంతమైన ప్రయాణ సదుపాయాన్ని అందిస్తోంది.

ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రోలో మొత్తం 94.2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. రోజుకు సగటున నాలుగున్నర లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. కొన్ని రోజుల్లో ప్రయాణికుల సంఖ్య గరిష్ఠంగా 5.20 లక్షలకు చేరుకుంది. మెట్రోలో ప్రయాణాల సంఖ్య వంద కోట్లకు చేరువ కావడం నగర ప్రజా రవాణా వ్యవస్థలో దాని ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. సమయానికి గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉండటంతో మిగిలిన ప్రాంతాలకు కూడా మెట్రో సేవలను విస్తరించాలని నగరవాసులు కోరుతున్నారు.

ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఇటీవల మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలవారీ పాస్‌ ధరను రూ.4 వేలు, రోజువారీ పాస్‌ ధరను రూ.275గా నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెట్రో సేవలను బలోపేతం చేసేందుకు మరో 60 కోచ్‌ల కొనుగోలుకు కూడా చర్యలు చేపట్టింది. ఇందుకోసం దిల్లీ మెట్రో రైలు సంస్థ టెండర్లను ఆహ్వానించింది.

అయితే మెట్రో తొమ్మిదేళ్ల ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. 2020లో కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో 169 రోజుల పాటు మెట్రో సేవలు నిలిచిపోయాయి. అంతకుముందు రోజుకు సుమారు ఐదు లక్షల మంది ప్రయాణించేవారు. కరోనా తర్వాత కూడా ఆ స్థాయి ప్రయాణికుల సంఖ్యను మెట్రో ఇంకా అందుకోలేకపోయింది. ప్రస్తుతం 57 రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఆర్థిక పరిస్థితి ప్రభుత్వానికి సవాలుగా మారింది. మెట్రోకు చెందిన ఆస్తులు, అప్పులను పరిగణనలోకి తీసుకుని మొదటి దశ ప్రాజెక్టుకు సుమారు రూ.22 వేల కోట్ల విలువ కట్టగా, రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్‌ 29న ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థతో ఒప్పందం చేసుకుంది. మెట్రో నిర్వహణ ద్వారా ఆదాయం వస్తున్నప్పటికీ, నిర్మాణం కోసం తీసుకున్న రుణాలపై అధిక వడ్డీలు చెల్లించాల్సి రావడంతో ప్రాజెక్టు మొత్తం నష్టాల్లో కొనసాగుతోంది. తొమ్మిదేళ్లలో నష్టాలు రూ.7 వేల కోట్లను దాటగా, 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే రూ.405 కోట్ల నష్టం నమోదైంది.

మెట్రోలో వంద శాతం వాటాను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పటికీ, ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రావాల్సిన రూ.13,600 కోట్ల రుణ మంజూరు ప్రక్రియ నిలిచిపోవడంతో స్వాధీన ప్రక్రియలో ప్రతిష్ఠంభన ఏర్పడింది. డిసెంబర్‌ నాటికి మెట్రోను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

పర్యావరణ పరిరక్షణలోనూ హైదరాబాద్ మెట్రో తన వంతు పాత్ర పోషిస్తోంది. విద్యుత్తుతో నడిచే రైళ్ల ద్వారా ఇప్పటివరకు 629 మిలియన్‌ కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలను ఆదా చేసినట్లు వెల్లడించింది. మొత్తం విద్యుత్తు వినియోగంలో 15 శాతం సౌర విద్యుత్తు ద్వారా సమకూరుతోంది. మెట్రో డిపోలు, స్టేషన్లపై ఏర్పాటు చేసిన సౌర విద్యుత్తు వ్యవస్థల ద్వారా 12.4 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ విధానం ద్వారా రైళ్లకు అవసరమైన విద్యుత్తులో 40 శాతం వరకు తిరిగి ఉత్పత్తి చేసుకుంటోంది.

ఇక మెట్రో విస్తరణపై నగరవాసులు ఆశలు పెట్టుకున్నారు. రెండో దశలో ఏడు మార్గాల్లో మొత్తం 122.9 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఈ ప్రతిపాదనలు రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. విస్తరణకు అనుమతులు లభిస్తే నగరంలోని మరిన్ని ప్రాంతాలకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తొమ్మిదేళ్లలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన హైదరాబాద్ మెట్రో, ఆర్థిక సమస్యలు, విస్తరణ సవాళ్లను అధిగమించి భవిష్యత్తులో మరింత విస్తరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Related News

Latest News