రేపే అకౌంట్లోకి రూ.2 వేలు.. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. రెడీగా ఉండండి..

ప్రతిపక్షం, నవంబర్ 25: తెలంగాణలో కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రభుత్వం నగదు విడుదల చేసేందుకు సిద్ధమైంది. పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుని, అర్హత సాధించినప్పటికీ ఇప్పటివరకు డబ్బుల కోసం ఎదురుచూస్తున్న వారికి నవంబర్ 26న శుభవార్త అందనుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త పింఛన్‌దారులకు సంబంధించిన నిధులను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి బటన్‌ నొక్కగానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంతో కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి ప్రతి నెలా ఆర్థిక భరోసా అందనుంది.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా భారీ సంఖ్యలో కొత్త పింఛన్లను మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలించారు. దరఖాస్తుదారుల వివరాలు, కుటుంబ పరిస్థితులు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హతలను తనిఖీ చేసిన అనంతరం 4.72 లక్షల మందిని అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. వీరందరికీ ఇప్పటికే పింఛన్‌ మంజూరు పత్రాలు కూడా అందించారు. అయితే నగదు ఎప్పటి నుంచి అందుతుందనే విషయంలో స్పష్టత కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్‌ 26 నుంచి కొత్తగా ఎంపికైన వారికి పింఛన్‌ సొమ్ము అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం తెలంగాణలో చేయూత పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు నెలకు రూ.2 వేల పింఛన్‌ అందిస్తున్నారు. కొత్తగా అర్హత సాధించిన 4.72 లక్షల మందికి కూడా ఇదే పథకం కింద నగదు చెల్లించనున్నారు. గతంలో పింఛన్‌ మొత్తాన్ని పోస్టాఫీసుల ద్వారా అందించే విధానం ఉండగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో పింఛన్‌దారులు నగదు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా తమ ఖాతాల్లోనే డబ్బులు పొందుతున్నారు. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు కూడా ఇదే విధానంలో చెల్లింపులు జరగనున్నాయి.

అచ్చంపేటలో జరిగే సభకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పింఛన్‌ నిధుల విడుదలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. వాస్తవానికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్‌ 19నే చీరల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే అదే సమయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభ కార్యక్రమం ఉండటంతో చీరల పంపిణీని వాయిదా వేసినట్లు సమాచారం. ఇప్పుడు నవంబర్‌ 26న అచ్చంపేట వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే చీరలను మండల కేంద్రాలకు తరలించినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక పంపిణీ కేంద్రాల ద్వారా మహిళలకు చీరలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధార్‌ కార్డు ఆధారంగా లబ్ధిదారులను గుర్తించి చీరలను పంపిణీ చేయనున్నారు. గ్రామాల్లో రేషన్‌ దుకాణాల వద్ద కూడా పంపిణీ ఏర్పాట్లు చేపట్టనున్నట్లు కథనంలో పేర్కొన్నారు. ఈసారి ఎరుపు జరీ అంచుతో కూడిన చిలకపచ్చ రంగు చీరలను ఎంపిక చేసినట్లు సమాచారం.

ఒకే రోజు కొత్త పింఛన్‌దారులకు నగదు విడుదల, మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం వంటి రెండు కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో కొత్తగా పింఛన్లు మంజూరైన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందడంతో పాటు మహిళలకు చీరలు పంపిణీ కానున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన వర్గాలకు పింఛన్‌ సొమ్ము నెలవారీ ఖర్చులకు తోడ్పడనుంది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 26న జరిగే కార్యక్రమం అనంతరం బ్యాంకు ఖాతాల్లో నగదు జమ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Related News

Latest News