తండ్రి కాబోతున్న ‘గే’ ప్రధాని!

ప్రతిపక్షం, అక్టోబర్ 21: నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్, ఆయన భాగస్వామి, అర్జెంటీనా హాకీ క్రీడాకారుడు నికోలస్ కీనన్ త్వరలో తల్లిదండ్రులుగా మారబోతున్నట్లు ప్రకటించారు. సరోగసీ విధానం ద్వారా తమ జీవితాల్లోకి చిన్నారి రాబోతున్నట్లు జెట్టెన్ వెల్లడించారు. 2027లో తమ బిడ్డ జన్మించనుందని తెలిపినట్లు సమాచారం. ఈ వార్తతో వారి వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుండగా, అంతర్జాతీయంగా కూడా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఈ జంట తమకు సహకరించిన అండదాతకు, బిడ్డను మోసి జన్మనివ్వనున్న మహిళకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ ప్రక్రియలో ఇద్దరు మహిళలు స్వచ్ఛందంగా సహకరించినట్లు సమాచారం. నెదర్లాండ్స్‌లో నిర్వహించిన కృత్రిమ గర్భధారణ ప్రక్రియ ద్వారా ఈ గర్భం సాధ్యమైందని, ఇది అక్కడి నిబంధనలకు అనుగుణంగా జరిగిందని వార్తా కథనాలు వెల్లడించాయి

రాబ్ జెట్టెన్, నికోలస్ కీనన్‌లకు 2024లో నిశ్చితార్థం జరిగింది. అయితే ప్రధాని బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు 2027లో తమ బిడ్డకు స్వాగతం పలకబోతుండటంతో వారి కుటుంబ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. బిడ్డ జన్మించిన సమయంలో కుటుంబంతో గడిపేందుకు కొంతకాలం విధుల నుంచి విరామం తీసుకోవాలని జెట్టెన్ భావిస్తున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.

స్వలింగ వివాహాలను 2001లో చట్టబద్ధం చేసిన ప్రపంచంలో తొలి దేశంగా నెదర్లాండ్స్ నిలిచింది. ఆ దేశానికి తొలి బహిరంగ స్వలింగ సంపర్క ప్రధానిగా రాబ్ జెట్టెన్ గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన తండ్రి కాబోతున్నారన్న వార్త అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తమ బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్న ఈ జంటకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Spread the love

Related News

Latest News