విగ్రహ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆర్థిక సహాయం
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 14: మెదక్ పట్టణంలోని ఆటోనగర్ పరిధిలో చేగుంట చౌరస్తా వద్ద ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసమైన ఘటన నేపథ్యంలో ఆమె మనవరాలు స్వప్న బుధవారం విగ్రహ స్థలాన్ని సందర్శించారు. విగ్రహం ధ్వంసం ఘటనపై తొలుత గుర్తుతెలియని వ్యక్తులు చేశారనే ప్రచారం జరిగినప్పటికీ, పోలీసుల దర్యాప్తులో సీసీ కెమెరాల దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం ఆధారంగా కోతుల వల్లే విగ్రహం దెబ్బతిన్నట్లు వెల్లడైంది.ఈ నేపథ్యంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని తిరిగి పునర్నిర్మించాలని నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తన సొంత నిధులతో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.
విగ్రహ స్థలాన్ని పరిశీలించిన అనంతరం స్వప్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకోగా, మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు ఆమెను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సొంత నిధులతో త్వరలోనే చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాగి అశోక్, మహేందర్ రెడ్డి, చిన్నశంకరంపేట మండల మాజీ జెడ్పీటీసీ రమణ, రజక సంఘం నాయకులు శివ, నవీన్, చౌదరి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




























