తెలంగాణ ఉద్యమకారులకు త్వరగా న్యాయం చేయాలి.. కేకే కమిటీకి కవిత వినతి

ప్రతిపక్షం, జూలై 22: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సమగ్ర నివేదిక సమర్పించారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను ఆలస్యం చేయకుండా, పారదర్శకంగా పూర్తి చేసి వారికి చట్టబద్ధమైన ప్రయోజనాలు కల్పించాలని కమిటీని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గత విధానాలను అధ్యయనం చేసి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం తాను బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడే అంతర్గతంగా పోరాటం చేశానని, ఆ కారణంగానే రాజకీయంగా నష్టపోయానని పేర్కొన్నారు. ఉద్యమకారులకు మేలు జరిగేలా తన సూచనలు ఉపయోగపడితే అదే తనకు గొప్ప సంతృప్తి అని అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల కోసం అమలు చేస్తున్న స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజన, అలాగే హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్ కింద అమలులో ఉన్న నిబంధనలను కమిటీ అధ్యయనం చేయాలని కవిత సూచించారు. ఆ విధానాల్లో ఉన్న ప్రయోజనాలను తెలంగాణ ఉద్యమకారులకు కూడా వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారితో పాటు, జైలు శిక్ష అనుభవించిన వారు, ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జిషీట్లు నమోదైన వారు, పోలీసుల దాడులకు గురైన వారు, ఆస్తి నష్టపోయిన వారు, వికలాంగులైన ఉద్యమకారులను ప్రాధాన్యంతో గుర్తించాలని అన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ ఉద్యమకారులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాలని సూచించారు.

ఉద్యమంలో పాల్గొని ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు, కానిస్టేబుళ్లు, ఉపాధ్యాయులు, డీలర్‌షిప్‌లు రద్దు చేయించుకున్న వారి సమస్యలను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుడు మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా నిబంధనలు రూపొందించాలని పేర్కొన్నారు.

జార్ఖండ్‌లో ఉద్యమకారుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, గుర్తింపు కార్డులు, శాశ్వత కమిటీ అమలు చేస్తున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కవిత సూచించారు. గోవా, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఉద్యమకారుల సంక్షేమ పథకాలను కూడా పరిశీలించాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఆలస్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేసిందని విమర్శించిన కవిత, ఉద్యమకారులకు ప్రయోజనాలు ప్రభుత్వం ఏర్పడిన తేదీ నుంచే వర్తించేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేకే కమిటీ కాలయాపన కమిటీ కాదని నిరూపిస్తూ, నిర్దిష్ట గడువులోగా ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేయాలని ఆమె కోరారు.

Spread the love

Related News

Latest News