తక్కువ పెట్టుబడి.. అధిక లాభం అంటే మోసానికి సంకేతం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 07: అత్యాశకు లోనై సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ‘‘తక్కువ పెట్టుబడి.. అధిక లాభం’’ అంటూ వచ్చే ఆఫర్లు సైబర్ మోసాలకు సంకేతమని హెచ్చరించారు.అక్టోబర్ నెలను నేషనల్ సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ మంత్‌గా నిర్వహిస్తున్న నేపథ్యంలో మెదక్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. గుర్తుతెలియని ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు, అనుమానాస్పద ఆఫర్లకు స్పందించవద్దని సూచించారు. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, లోన్ యాప్‌లు, ఆన్‌లైన్ షాపింగ్, పెట్టుబడులు, అధికారుల పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
బ్యాంకు ఖాతా వివరాలు, OTP, ATM PIN, UPI PIN, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, అలాగే cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. సకాలంలో సమాచారం అందిస్తే మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు.అక్టోబర్ నెలంతా పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లు, ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రజలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, ఆర్‌ఐ శైలేందర్, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.





























