ప్రతీకారంతో రాక్షసుడిగా మారిన తండ్రి.. భార్య, ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురి దారుణ హత్య

ప్రతిపక్షం, జూలై 11: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దయ్యాలగూడలో జరిగిన ఆరుగురు హత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కుటుంబానికి అండగా ఉండాల్సిన తండ్రే కర్కశుడిగా మారి భార్య, ఇద్దరు చిన్నారులతో పాటు తనపై పోక్సో కేసు నమోదు చేసిన బాలిక కుటుంబంలోని ముగ్గురిని అత్యంత దారుణంగా హత్య చేయడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. షాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్ (28)పై గతంలో ఓ మైనర్ బాలిక పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసింది. ఆ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన అతడు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. అప్పటి నుంచి తనపై కేసు పెట్టిన కుటుంబంపై తీవ్ర ద్వేషం పెంచుకున్న రాజ్‌కుమార్ ప్రతీకారంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ముందుగా బాలిక ఇంటికి వెళ్లిన నిందితుడు ఆమె తల్లి, నానమ్మపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం బాలికను గ్రామ శివారులోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం తన ఇంటికి చేరుకున్న రాజ్‌కుమార్, నిద్రలో ఉన్న భార్యతో పాటు ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులను కూడా విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపాడు.

ఒకేరోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో దయ్యాలగూడ గ్రామం విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను సొంత తండ్రే హత్య చేయడం స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది. గ్రామస్థులు ఈ ఘటనను జీర్ణించుకోలేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం అందుకున్న షాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. హత్యలకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి మానసిక పరిస్థితి, ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళలు, చిన్నారుల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

Spread the love

Related News

Latest News