Trending Now

సీఎం రేవంత్‌కి హరీష్ రావు సవాల్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు ఋణమాఫీ చేసి, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సవాలు విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ ది తొండి రాజకీయం.. ఆయన ఇచ్చిన సవాలును నేను స్వీకరిస్తున్నానున్నారు. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను.. నాకు పదవులు ముఖ్యం కాదు.. రైతు రుణమాఫీ, ఇచ్చిన హామీలు చేయకపోతే నువ్వు నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావా..? ఈ విషయాలపై ఎల్లుండి నేను అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్దకు చర్చకు వస్తా.. చర్చకు సీఎం రేవంత్ కూడా రావాలని ఆయన తెలిపారు.

రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తామన్నారు. ఇంకా చేయలేదు. కనీసం దానికి సంబంధించిన విధి విధానాలు కూడా తయారు చేయలేదు. ఇప్పుడు మళ్లీ కొత్త డేట్ పెడుతున్నారు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేయనందుకు ముందు రేవంత్ రెడ్డి గారు రైతులకు క్షమాపణ చెప్పాలి. జరిగిన జాప్యానికి బాధ్యత వహించాలి. తాజాగా ఇచ్చిన హామీ ప్రకారమైనా ఆగస్టు 15లోపు వందకు వంద శాతం రుణమాఫీ చేయాలి. మహాలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు నెలకు 2,500 ఇస్తామన్నారు. ఇప్పటికి నాలుగు నెలలు గడిచి పోయాయి. ఒక్కో మహిళలకు మీరు ఇప్పటికే 10,000 బాకీ ఉన్నారు. ఎప్పుడు ఈ బాకీ తీరుస్తారు. నెల నెలా ఎప్పటి నుంచి ఖాతాలో వేస్తారు? అని హరీష్ రావు ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి పథకం కింద ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. గడిచిన నాలుగు నెలల్లో వేల సంఖ్యలో పెళ్లిల్లు జరిగాయి. వారికి బంగారం ఎప్పుడు ఇస్తారు..? రైతుభరోసా కింద ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రబీ సీజన్ లో రైతుబంధుకు పెంచిన సాయం అందిస్తామని చెప్పారు. కానీ మేమిచ్చిన రైతుబంధు పథకం డబ్బులే ఇంకా అందరీ అందలేదు. గడిచిన రబీసీజన్ కు ఎకరానికి 5 వేలు బకాయి పడ్డారు. మళ్లీ ఖరీఫ్ సీజన్ లో జూన్ నుంచి మీరు ఎకరానికి 15,000 ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడు ఇస్తారు? ఎంత ఇస్తారు? అసలు ఇస్తారా? ఇవ్వరా? అనేది స్పష్టంచేయాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతీ పంటకు క్వింటాకు 500 చొప్పున బోనస్ ఇస్తామన్నారు. రబీ సీజన్ నుంచే ఇస్తామని చెప్పారు. కానీ రబీ సీజన్ లో ఒక్క క్వింటాకు కూడా బోనస్ ఇవ్వలేదు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలకు 12 వేల చొప్పు ఆర్థిక సాయం చేస్తామన్నారు. వంద రోజుల్లో చేస్తామని చెపితే, నాలుగు నెలలు దాటి ఐదో నెల గడుస్తోంది. వ్యవసాయ కూలీలకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు..?

చేయూత పథకం కింద పెన్షన్ ను 2 వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామన్నారు. కానీ నేటికీ పెంచిన పెన్షన్ రావడం లేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల చొప్పున ఇచ్చే పెన్షన్ కూడా మీరు జనవరి నెలకు ఇవ్వలేదు. నెలకు రెండు వేల చొప్పున ఐదు నెలలకు గాను, మీరు ఒక్కొక్కరికీ పదివేల రూపాయలు బాకీ పడ్డారు. జనవరి నెలకు సంబంధించి మొత్తం ఎగ్గొట్టారు. ఆ నెలది కూడా బకాయి పడ్డారు. బకాయిలు ఎప్పుడు ఇస్తారు? పెంచిన పెన్షన్ ఎప్పుడిస్తారు? నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు ఎవరికీ ఇవ్వలేదు. ఐదు నెలలకు గాను, ఒక్కో నిరుద్యోగికి మీరు 20,000 బాకీ పడ్డారు. అవి ఎప్పుడు ఇస్తారు. ఈ బకాయిలు తీర్చి, ఈ పథకాలు సక్రమంగా ప్రతీ నెలా అమలు చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నది. మీ బాధ్యతలను గుర్తు చేసే ప్రతిపక్షాల మీద దాడి చేయడం మీ తొండి రాజకీయానికి నిదర్శనం. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే, మీ చేతగాని తనాన్ని ఒప్పుకుని పదవి నుంచి తప్పుకోండి. చేతనైతే అమలు చేయండని కాంగ్రెస్‌పై హరీష్ రావు మండిపడ్డారు.

Spread the love

Related News

Latest News