Trending Now

జబర్ధస్త్​గా ఆస్తిపన్ను వసూళ్లు..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: మార్చి 30తో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో కొన్ని మున్సిపాలిటీలలో కమీషనర్లు, సిబ్బంది ఆస్తిపన్నును ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మరి కొన్ని మున్సిపాలిటీలలో ఆస్తులు జప్తు చేస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. గత బీఆర్​ఎస్​ పార్టీకి అంటకాగిన అధికారులు కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు బలమైన ఆరోపణలున్నాయి. నిర్మల్​మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను చెల్లించడంలేదంటూ కరెంటు కట్​ చేయడంతో పాటు నల్లాకట్​ చేస్తున్నారు. కొంత మంది మరో అడుగు ముందుకేసి ఇంటి తలుపులు‌.. గేట్లు ఎత్తుకెళ్తున్నారు. నిర్మల్ మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది ఆస్తిపన్ను బకాయి దారులకు ఇప్పటికే రెడ్‌ నోటీసులను జారీ చేసినా.. మొండి బకాయిదారులు స్పందించకపోవడంతో తమదైన స్టైల్‎లో షాక్ ఇస్తున్నారు. ఇంటికున్న తలుపులు, గేట్లు, విలువైన పర్నిచర్ స్వాధీనం చేసుకుని ఝలక్ ఇస్తున్నారు‌. నిర్మల్‌ జిల్లా కలెక్టర్ ఆశిష్ ఇచ్చిన ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటిస్తూ పన్ను ఎగవేత దారులకు‌ తమదైన పద్దతిలో చుక్కలు చూపిస్తున్నారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్‌ కాలనీ, గాజుల్‌పేట కాలనీల్లో సోమవారం పన్నుల వసూలుకు వెళ్లిన మున్సిపల్ సిబ్బంది.. మొండి బకాయి దారుల ఇంటి నుండి సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. రెండు కాలనీల్లోని ఆరు ఇండ్ల యజమానులు గత కొన్ని నెలలుగా పన్నులు చెల్లించకపోవడంతో రెడ్ నోటీసులు‌జారీ చేశారు. రెవెన్యూ అధికారి అనూప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆరు ఇండ్లను జప్తు చేసి అందులోని సామాగ్రిని మున్సిపల్ కార్యలయానికి తరలించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ ఆదేశాల మేరకు పన్నుల వసూళ్లకై ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన మున్సిపల్ సిబ్బంది.. పట్టణంలోని రెండు కాలనీలలో కొరడా ఝళిపించారు.

ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా మున్సిపాలిటీ ఆదాయంతోనే అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించడంతో.. ఇలా మొండి బకాయిలు వసూలు చేసే పనిలో పడ్డారు. 8 బృందాలుగా ఏర్పడిన సిబ్బంది.. ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు వార్డుల వారీగా తిరుగుతూ.. మున్సిపల్ ట్యాక్స్ చెల్లించని వారిని కలిసి టాక్స్ కట్టాలని కోరుతున్నారు. అయినా వినని స్థానికుల సామాగ్రిని జప్తు చేసి షాక్ ఇస్తున్నారు. బకాయిలు చెల్లించడంలో జాప్యం చేయడంతో పాటు గొడవకు‌ దిగుతున్న బకాయిదారులపై కేసులు కూడా పెడుతామంటూ చెప్తున్నారు. బకాయి వసూళ్లకు పోలీస్ సాయం కూడా తీసుకుంటున్నారు. జప్తు చేసిన సామాగ్రిని పన్ను చెల్లించి తీసుకెళ్లాలని లేదంటే వేలం‌వేస్తామని చెపుతున్నారు.

ఆస్తుల జప్తుపై ప్రజల కన్నెర్ర..

ఆస్తిపన్ను చెల్లించని వారి ఆస్తులను జప్తు చేయడం పట్ల ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. కొంత మంది గత ప్రభుత్వానికి అంటకాగిన అధికారులు నూతన కాంగ్రెస్​ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత తీసుకవచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఆస్తులు జప్తులు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా విద్యుత్​శాఖలో కూడా అలాంటి అధికారులు ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నారు. గత ప్రభుత్వంలో మంత్రుల బంధువులు, ఎమ్మెల్యేల బంధువులు కరెంటు శాఖలో అధికారులుగా పనిచేస్తున్నారని, వారు నిరవధికంగా కరెంటు కట్​ చేస్తూ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్​రెడ్డి ఇలాంటి అధికారులపై నిఘా పెట్టి అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్​ శ్రేణులు ధీనంగా వేడుకుంటున్నారు.

Spread the love