Trending Now

కేసీఆర్‌తోనే మెదక్ అభివృద్ధి సాధ్యం..

1952లో బెల్ ఏర్పాటు చేస్తే ఇందిరమ్మ హయాంలో అంటారా..?

దమ్ముంటే రాజీనామా సవాల్‌కు సిద్ధమా రేవంత్

కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన

మెదక్ గడ్డ మీద గులాబీ జెండా రెపరేపలాడటం ఖాయం

ప్రతిపక్షం, మెదక్, ఏప్రిల్ 25: ఆగస్టు 15 లోగా రుణ మాఫీతో పాటు 6 గ్యారంటీలు అమలు చేస్తే తాను రాజీనామా కు సిద్దమని, నువ్వు సిద్ధమా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు.. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మెదక్ లోని రాందాస్ చౌరస్తాలో జరిగిన రోడ్ షో లో ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు అమర వీరుల స్తూపం వద్ద రాజీనామా పత్రంతో రావాలని, ఆగస్టు 15 లోగా ఋణమాపీ, 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రం స్పీకర్‌కు అందిస్తామని, చెయ్యక పోతే రేవంత్ రెడ్డి రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందించాలని సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించకపోతే తోక ముడిచినట్లవుతుందన్నారు.

మెదక్ లో కేసీఆర్ ఎం చేశాడని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ని మెదక్ గడ్డ మీదికి తీసుకొచ్చిన ఘనత గులాబీ జెండా కే దక్కుతుందన్నారు. మెదక్ జిల్లాగా ఏర్పడటం మూలంగానే నామినేషన్ కోసం రేవంత్ రెడ్డి మెదక్ వొచ్చిన విషయం గమనించాలన్నారు. మూడు జిల్లాలు, మూడు మెడికల్ కళాశాలలు, 100 కోట్లతో మెదక్ కు రైలు సౌకర్యం, మెదక్ లో నాలుగు లైన్ల రోడ్డు, హల్ది వాగులోకి నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ కె దక్కుతుందన్నారు. 1952 లో బెల్ ఏర్పాటైతే ఇందిరాగాంధీ గెలిచిన 1980 లో ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

స్క్రిప్ట్ రాసే వానికి లేకున్నా, చదివే వారికి బుద్ది ఉండాలన్నారు.. నీ ఇజ్జత్ పోయినా పర్వాలేదు కానీ, సీఎం కుర్చీ ఇజ్జత్ తీస్తున్నారన్నారు. 6 గ్యారంటీలలో మహాలక్ష్మి, రైతు భరోసా, వడ్లకు 500 బోనస్, డబుల్ బెడ్రూం ఇళ్లు, 4 వేల పించిన్, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు లన్నీ బుట్ట దాఖలయ్యాయన్నారు. 6 గ్యారంటీల గురుంచి బాండ్ పేపర్ ల మీద వ్రాసి కాంగ్రెస్ లీడర్లు దాని విలువ తీశారని, నేడు ఎక్కడికి వెళితే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేస్తున్నారని, రేవంత్ ఎన్ని ప్రమాణాలు చేసినా ప్రజలు నమ్మరన్నారు..నా ఎత్తు మీద ఉన్న ధ్యాస రైతుల ధాన్యం తీసుకోవడంలో చూపెట్టాలని రేవంత్ రెడ్డి ని కోరారు.. భువనగిరి లో ఎస్సీ మహిళలపై అరాచకాలు అవుతున్నా, 280 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఆటో కార్మికుల ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. అధికార మదం తో కాంగ్రెస్ నాయకులు గాల్లో తెలుతున్నారని, ఎంపీ ఎన్నికల్లో బుద్ది చెబితే భూమ్మీదికి వొస్తారన్నారు.

డొకబాజీ బీజేపీ కి బుద్ది చెప్పాలి..

బీజేపీ మాటలు నమ్మితే నీళ్లు లేని బాయిలో దుంకినట్లే అవుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కు ఒక్క మెడికల్, నర్సింగ్ కళాశాల ఇవ్వలేదన్నారు. దుబ్బాకలో ఎడ్లు, నాగలి ఇస్తామని మోసం చేసిన రఘునందన్ రావు కు దుబ్బాక ప్రజలు బుద్ది చెప్పారని, ఎంపీ ఎన్నికల్లో సైతం బుద్ది చెప్పాలన్నారు.. బీజేపీ ఒక్క మంచి పని చేయలేదని, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారని, ఓటు తో బుద్ది చెప్పాలన్నారు. మత రాజకీయాలు మనకు అవసరం లేవని, గులాబీ పార్టీకి పట్టం కట్టాలన్నారు.

తెలంగాణ ప్రజలకు తక్కువ కాలంలోనే నీళ్లు ఏవో పాలు ఏవో తెలిసాయని, ఓ ప్రముఖ టీవీకి ఇచ్చిన చర్చ లో కాంగ్రెస్ మోసాలను కేసీఆర్ కళ్ళకు కట్టినట్లు వివరించాడన్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తుందని, పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమన్నారు. మెదక్ జిల్లా కోసం ఈ రాందాస్ చౌరస్తా లో మెదక్ జిల్లా కోసం ఎన్నో పోరాటాలు చేశారని, ఎంతో మంది మోసం చేసినా, కేసీఆర్ సాకారం చేశారన్నారు. ఉన్న జిల్లాలను ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తుందని, ఓటు తో బుద్ది చెప్పాలన్నారు. ఎంపీగా పోటీ చేసే అభ్యర్థుల లో ఒకరు బ్లాక్ మెయిలర్ అని, ఒకరు 6వ తరగతి అని, మన మాజీ కలెక్టర్ అయితేనే పార్లమెంట్ లో మన హక్కుల కోసం పోరాటం సాగిస్తాడన్నారు.జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గా విశేష సేవలు చేసిన వెంకట్రామరెడ్డి ప్రజా సేవ కోసం వొస్తున్నారని, 100 కోట్ల ట్రస్టు ద్వారా ఎంతో మంది పేదలకు మేలు జరుగుతుంది ఆశీర్వదించాలని కోరారు. మిట్ట మధ్యాహ్నం ఎండ మండుతున్నా కదలకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు నిలబడ్డారని, సిద్దిపేటలో టెంట్ కింద బీజేపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారని, ఇదీ వారికి మన పార్టీకి ఉన్న తేడా అన్నారు.

మీ సేవ కోసం వొస్తున్నా ఆశీర్వదించాలి: ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి

కలెక్టర్ గా ఖ్యాతి ఇచ్చిన ఈ గడ్డ ప్రజలు, సేవకునిగా సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి కోరారు..తెలంగాణ ప్రదాత కేసీఆర్ ఆశీస్సులతో మెదక్ లో నామినేషన్ వేస్తున్నానని, అండగా నిలవాలన్నారు..మాయ మాటలు రావని, దైవ సాక్షిగా చెబుతున్న నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తానని, కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి నిరుపేద యువతీ, యువకులకు అండగా నిలుస్తామన్నారు.. ఎన్నికల్లో నిలబడ్డ వారి గుణ గుణాలు పరిశీలించాలని, ట్రస్టు సేవలు గడప గడపకు తెలియ జెప్పాలని ఆయన కోరారు.నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి పేదలకు అందిస్తామన్నారు. మండుటెండలో తరలి వొచ్చిన అశేష జనవాహిని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్‌తో ఉన్నయి పోయాయి.. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి..

6 గ్యారంటీలు, 420 హామీలు ఆటకెక్కాయని, ఉన్న రైతుబంధు, 24 గంటల కరెంటు, తాగునీళ్లు కూడా అందడం లేవని మాజీ మంత్రివర్యులు, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.. మన హల్ది వాగు లోకి నీళ్లు పారించిన ఘనత కేసీఆర్, హరీశ్ రావులకు దక్కుతుందన్నారు.. కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరా పొలం ఎండిపోలేదని, నేడు 20 లక్షల ఎకరాలలో పంట ఎండిపోయిందన్నారు.కేసీఆర్, బీఆర్ఎస్ తోనే మనకు శ్రీ రామ రక్ష అని ఆమె పేర్కొన్నారు.

మెదక్ లో భారీ మెజారిటీ అందిస్తాం : మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ఏమి కోల్పోయామో మెదక్ ప్రజలు గమనించారని, ఎంపీ ఎన్నికల్లో ఘన విజయం అందిస్తామని మాజీ ఎమ్మెల్యే, మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు..10 ఏళ్లలో మెదక్ లో చేసిన అభివృద్ధి కనిపించలేదా..మెదక్ జిల్లా, మెదక్ కు రైలు, రోడ్డు వెడల్పు, సాగు, తాగు నీటి సౌకర్యాలు కనిపిస్త లెవా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.. కేసీఆర్ హయాంలో నిర్మించిన రోడ్డుపై వెళ్లారని, కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశావని రేవంత్ రెడ్డి కి గుర్తు చేశారు. మెదక్ కు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, మంజూరైన కోట్లాది రూపాయల నిధులు రద్దు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలన్నారు.

రోడ్ షో సందర్భంగా వేల సంఖ్యలో ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు తరలి రావడంతో మెదక్ వీధులు గులాబీ మాయం అయింది..కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు మార్మోగాయి. సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎమ్మెల్సీలు డా; వంటేరు యాదవ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, పట్నం మాణిక్యం, మల్లికార్జున గౌడ్, చంద్రగౌడ్, కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, బట్టి జగపతి, జితేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News