Trending Now

కేసీఆర్​కు మతిభ్రమించింది.. మంత్రి ఉత్తమ్

ప్రతిపక్షం స్టేట్​బ్యూరో, హైదరాబాద్, ఏప్రిల్ 1: బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, ఇంకా ఆయన ఓటమినుంచి కోలుకోలేదని ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం గాంధీభవన్​లో టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్​కుమార్​గౌడ్​, టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్​ ఛైర్మన్​ సామ రామ్మోహన్​రెడ్డితో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమే అని, ఆయన డిప్రెషన్, ఫస్ట్రేషన్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా కేసీఆర్ స్పీచ్ విన్నాక ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడారు అని అనిపించిందన్నారు.

ఓడిపోవడమే కాదు, పార్టీ మిగలదు అనే భయం కేసీఆర్‌లో మొదలైందన్నారు. పొంగనాలకు పోయి జాతీయ పార్టీ అన్నారని.. ఇంత తొందరగా ఏ పార్టీ కుప్ప కూలిపోలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మిగలదని అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు తప్ప బీఆర్ఎస్‌లో ఎవరూ మిగలరన్నారు. జనరేటర్ పెట్టుకొని మీటింగ్ పెట్టి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంట్ పోయిందని కేసీఆర్ అబద్దం చెప్పారన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ అని.. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారమన్నారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదన్నారు. కరెంటు కోతలంటూ బీఆర్​ఎస్​ నేతలే ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో సాంకేతిక కారణాలతో కరెంటు కట్​ చేయలేదా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన ఓటమిని బీఆర్​ఎస్​ నేతలు అంగీకరించడంలేదని, మరో ఆరు మాసాల తర్వాత అధికారంలోకి వస్తామంటూ ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.

పదేళ్లలో పంటనష్టంపై ఒక్క రూపాయి ఇచ్చారా..?

కేసీఆర్​ సీఎంగా పదేండ్లలో పంట నష్టం జరిగితే రైతులను కనీసం పరామర్శించిన పాపాన పోలేదని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనిఉత్తమ్​ మండిపడ్డారు. ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పచెప్తామని బీఆర్‌ఎస్ చీఫ్ ఒప్పుకున్నారని గుర్తుచేశారు. అందుకు సంతకాలు కూడా చేసి, నేడు ఆయన అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ – జగన్ కలిసి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ హయాంలో తెలంగాణకు ఎక్కువ ద్రోహం జరిగిందన్నారు. పోలీస్ శాఖను ఎక్కువ మిస్ యూజ్ చేసింది కేసీఆరే అని విమర్శించారు. పోలీసులు న్యూట్రల్‌గా ఉండాలని ఇప్పుడు కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కరువు వచ్చింది బీఆర్ఎస్ పాలనలోనే అని.. దాన్ని సమర్థవంతంగా డీల్ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్ పేర్కొన్నారు.

కేసీఆర్ కుటుంబం తప్పా మిగతా నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దం..

కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్పా మిగతా నేతలందరూ కాంగ్రెస్‌ లో చేరడానికి సిద్దంగా ఉన్నారని, తమ పాలన చూసే ప్రతిపక్ష ఎమ్మేల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ పార్లమెంట్‌లో బీఆర్ఎస్, బీజేపీ లకు డిపాజిట్ కూడా రాదన్నారు. 14 ఎంపీ సీట్లు తప్పకుండా గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ తర్వాత అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని, వంద శాతం తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ట్యాపింగ్ వెనక ఎంత పెద్ద నాయకులు ఉన్నా శిక్ష పడుతుందన్నారు.

కూతురు కవిత ఒక కేసులో ఇరుక్కుపోయిందని, గొర్రెల స్కాంలో కొందరు ఇరుక్కుపోయారని, ఇక ఫోన్ ట్యాపింగ్‌లో ఎవరెవరు ఇరుకుతారోనని బీఆర్ఎస్ వాళ్ళకి భయంగా ఉందన్నారు. రూ. 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, తెలంగాణలో తాగునీటి సమస్య, కరెంట్ సమస్య లేదని చెప్పారు. కేసీఆర్‌లా ఫామ్ హౌజ్‌లో పండుకునే అలవాటు తమకు లేదన్నారు. ప్రతి రోజూ సచివాలయానికి వస్తున్నామని, ప్రతి సమస్యపై వారం.. పదిరోజులకొకసారి రివ్యూ చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దాబాయింపు చేశారని, బీఆర్ఎస్‌కు మళ్లీ అధికారం కల్ల అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Spread the love