Trending Now

‘ఒళ్లు దగ్గర పెట్టుకో..’ బీఆర్‌ఎస్ మాజీ మంత్రికి ఉద్యోగ సంఘాల హెచ్చరిక..!

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: గత ప్రభుత్వంలో నెంబర్​ త్రీగా వెలిగిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై తెలంగాణ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. హరీశ్​రావు ఇటీవల ఉద్యోగులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు నెల ఒకటో తేదీననే జీతాలు ఇస్తున్నారు. అయితే ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఏసీల్లో ఉండే ఉద్యోగులకు ముందుగా జీతాలు ఇస్తున్నారని, పలు శాఖల్లో పనిచేస్తున్న అవుట్​సోర్స్​ ఉద్యోగులకు రెండు మాసాలు అయినా జీతాలు రావడంలేదని, వారికి వెంటనే జీతాలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగుల పాత్ర మర్చిపోవద్దని చెప్పారు. రైతులు దేశానికి వెన్నుముక.. ఇందులో సందేహం లేదన్నారు. కానీ ఉద్యోగులను అలా అనడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలిస్తుంటే హరీశ్‌‌‌‌ ఎందుకంత కోపమని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీటీఏ) విమర్శించింది.

హరీశ్ రావు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షౌకత్ అలీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్ రావుకు ఒకటో తారీఖు జీతాలు ఇస్తారని తెలియదా అని ప్రశ్నించారు. హరీశ్ రావు వ్యాఖ్యలకు నిరసనగా నల్లబ్యాడ్జీలుతో నిరసన తెలుపుతామని చెప్పారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి స్పందించారు. 35 రోజుల వేతనాలను పక్కనపెట్టి సకల జనుల సమ్మెలో పాల్గొన్నామని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందని ఉద్యోగులపై హరీష్ రావు అక్కసు వెళ్ళగక్కడాన్ని అదిలాబాద్ ఉద్యోగుల సంఘం సునీల్ చౌహన్ అన్నారు. హరీశ్ రావు ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Spread the love