ప్రతిపక్షం, జూన్ 08: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గత పన్నెండు సంవత్సరాల్లో ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక కీలక కార్యక్రమాలు అమలు చేసిందని పేర్కొన్నారు.
దేశ ప్రగతిలో సంక్షేమ పథకాలు ముఖ్య పాత్ర పోషించాయని, అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన కిషన్‌రెడ్డి, అవినీతి రాజకీయాలకు కాంగ్రెస్ ప్రతీకగా మారిందని ఆరోపించారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన చరిత్ర ఆ పార్టీదేనని వ్యాఖ్యానించారు.
బొగ్గు రంగంలో చేపట్టిన సంస్కరణల వల్ల అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడిందని ఆయన తెలిపారు. బొగ్గు ఉత్పత్తి, వినియోగంలో భారత్ ప్రపంచంలో అగ్రగామి దేశాల సరసన నిలుస్తోందని పేర్కొన్నారు.
దేశ పారిశ్రామికాభివృద్ధి, విద్యుత్ ఉత్పత్తి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు బొగ్గు రంగం కీలకంగా మారిందని కిషన్‌రెడ్డి వివరించారు. ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
















