ప్రతిపక్షం, జూలై 18: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్యోగాల భర్తీ గణాంకాలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్నది పూర్తిగా అసత్యమని, అది నిజమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా యువతలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ, ‘ప్యారడైజ్’ సినిమాలోని పాటను ఉదహరించారు. “ఈ యువతరానికి పొట్టు పొట్టు ఆకలుంది” అంటూ ప్రారంభించి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.
రాష్ట్ర యువత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి గోరీ కట్టాలని యువత ఒట్టు పెట్టుకుంటోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కథకు ముగింపు యువతే రాస్తుందని, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తూ, రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి సమాధానం ఇస్తారని పేర్కొన్నారు.

















