పార్టీ బలోపేతమే లక్ష్యం.. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్న నూతన ఉపాధ్యక్షుడు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, జూలై 11: భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షునిగా తోడుపునూరి వెంకటేశంను పార్టీ రాష్ట్ర నాయకత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అంకితభావంతో పనిచేస్తానని శనివారం ప్రకటించారు. తనను జిల్లా ఉపాధ్యక్షునిగా నియమించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్‌రావు, బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్‌తో పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరి ప్రేమాభిమానాలు తనపై మరింత బాధ్యతను పెంచాయని అన్నారు.పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని, సిద్దిపేట జిల్లాలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యకర్తలతో సమన్వయం పెంచుతూ పార్టీ విస్తరణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెంకటేశం స్పష్టం చేశారు.ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ఆయన మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆశయాల సాధన కోసం సమిష్టిగా పనిచేస్తూ సిద్దిపేట జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయడమే తన ధ్యేయమని పేర్కొన్నారు.



















