ప్రతిపక్షం, జూన్ 25: తుంగభద్ర ఆనకట్టలో 33 గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని కరవు ప్రభావిత ప్రాంతాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.
తుంగభద్ర జలాల వినియోగంపై మాట్లాడుతూ, రాజోలిబండ మళ్లింపు కాలువకు కేటాయించిన 15 టీఎంసీల నీటిలో గణనీయమైన భాగం తెలంగాణకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ చొరవ తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీకే తనకు పెద్దన్న లాంటి వారని, ఆయన చొరవ వల్లే కేంద్ర మంత్రితో పాటు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సాధ్యమైందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గురించి కూడా ప్రశంసలు వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, దేశంలోనే అత్యంత అనుభవజ్ఞులైన నాయకుల్లో ఆయన ఒకరని అన్నారు. మూడు రాష్ట్రాల మధ్య సమన్వయంతో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ఈ సమావేశం కీలక అడుగుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

















