ప్రతిపక్షం, ఆగస్టు 14: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ప్రెజర్ కుక్కర్ మూతతో కొట్టి, అనంతరం బాత్‌టబ్‌లోని నీటిలో ముంచి హత్య చేశాడు. ఆపై తన భార్య ప్రమాదవశాత్తు స్పృహతప్పి పడిపోయిందంటూ నాటకమాడాడు. అయితే ఫోరెన్సిక్ ఆధారాలతో పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు.
ఫతేపూర్ జిల్లా నాసిర్పూర్ మొహల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అల్లీపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో దిలీప్ యాదవ్ అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తుండగా.. అతని భార్య శాలిని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వీరిద్దరూ 2017 డిసెంబర్ 3న ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం సజావుగానే సాగిన వారి వైవాహిక జీవితంలో తర్వాత విభేదాలు మొదలయ్యాయి.
భార్యపై అనుమానంతో..
శాలినికి మరో వ్యక్తితో సంబంధం ఉందంటూ దిలీప్ తరచూ అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 8న ఆమెను హత్య చేయాలని పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు తన ఇద్దరు సోదరుల సహాయం కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇంట్లో భార్యతో ఘర్షణ జరిగిన సమయంలో దిలీప్ ప్రెజర్ కుక్కర్ మూతతో శాలిని తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె కిందపడిపోవడంతో.. అనంతరం బాత్‌టబ్‌లోని నీటిలో ఆమెను ముంచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం
హత్య అనంతరం దిలీప్ కొంతసేపు బయట తిరిగి.. ఆ తర్వాత తన సోదరులకు ఫోన్ చేశాడు. భార్య అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయిందని చెప్పి ఆమెను ఆసుపత్రికి తరలించాడు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే శాలిని మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతదేహంపై గాయాలు ఉండటం, ఘటనాస్థలంలోని పరిస్థితులు అనుమానాస్పదంగా కనిపించడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం శాలిని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోరెన్సిక్ ఆధారాలతో అసలు నిజం
ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలను సేకరించాయి. పోలీసుల విచారణలో దిలీప్ చెప్పిన కథలో పొంతన లేకపోవడంతో అతడిపై అనుమానం పెరిగింది. చివరకు భార్యపై ఉన్న అనుమానంతోనే సోదరుల సహకారంతో హత్య చేసినట్లు అతడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో ప్రధాన నిందితుడైన దిలీప్ యాదవ్‌ను ఆగస్టు 12న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది. ఘటనలో అతడి సోదరుల పాత్రపైనా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





























