ప్రతిపక్షం, జూలై 25: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఇచ్చిన ప్రత్యేక బహుమతిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఆనందం వ్యక్తం చేశారు. లార్డ్స్‌లో జరిగిన వన్డే మ్యాచ్ అనంతరం రోహిత్ తన జెర్సీపై స్వయంగా సంతకం చేసి బట్లర్‌కు బహుమతిగా అందించారు.
జెర్సీపై రోహిత్ శర్మ, “ప్రియమైన జోస్.. నీతో కలిసి, నీకు ప్రత్యర్థిగా ఆడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది” అని ప్రత్యేక సందేశం రాశారు. ఈ అరుదైన బహుమతిని అందుకున్న బట్లర్ ఆ జెర్సీ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.
అంతేకాకుండా, “మీరు నాకు ఎంతో ఇష్టమైన క్రికెటర్లలో ఒకరు. చాలా కాలంగా ప్రత్యర్థి ఆటగాడి జెర్సీని సేకరించాలని అనుకుంటున్నాను. ఆ కోరికను మీరు నెరవేర్చారు. ఈ జెర్సీని జీవితాంతం జాగ్రత్తగా దాచుకుంటాను. ధన్యవాదాలు రోహిత్” అంటూ భావోద్వేగంగా స్పందించారు.
ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల మధ్య ఉన్న పరస్పర గౌరవానికి ఈ సంఘటన మరో ఉదాహరణగా నిలిచింది. బట్లర్ చేసిన ఈ పోస్టుకు అభిమానులు భారీగా స్పందిస్తూ, క్రీడాస్ఫూర్తికి ఇదే నిదర్శనమని ప్రశంసలు కురిపిస్తున్నారు.

















