ప్రతిపక్షం, ఆగస్టు 25, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన నిఘా ఆరోపణలపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఎంపీని అనుసరించేందుకు లేదా ఆయన కదలికలపై నిఘా పెట్టేందుకు పోలీసు శాఖ తరఫున ఎలాంటి అధికారిని నియమించలేదని డీజీపీ స్పష్టం చేశారు.
ఎంపీ అర్వింద్ చేసిన ఆరోపణలను పోలీసులు తీవ్రంగా పరిగణించి సంబంధిత వర్గాల నుంచి పూర్తి వివరాలు సేకరించినట్లు డీజీపీ తెలిపారు. అందుబాటులో ఉన్న సమాచారం, వాస్తవాలను పరిశీలించిన అనంతరం ఎంపీపై నిఘా పెట్టేందుకు ఎలాంటి పోలీసు అధికారిని నియమించలేదని నిర్ధారించుకున్నామని వెల్లడించారు.
పోలీసు శాఖపై వచ్చిన ఆరోపణల విషయంలో వాస్తవాలను నిర్ధారించుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్న డీజీపీ.. ఈ అంశంపై సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకున్నామని తెలిపారు. ఎంపీ అర్వింద్ వద్ద ఈ ఆరోపణలకు సంబంధించి మరిన్ని ఆధారాలు లేదా సమాచారం ఉంటే నేరుగా తనకు అందించాలని సూచించారు.
తన వద్ద ఉన్న అదనపు ఆధారాలను అందిస్తే వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. దీంతో ఎంపీ అర్వింద్ చేసిన ఆరోపణలకు పోలీసు శాఖ నుంచి అధికారికంగా వివరణ వచ్చినట్లయింది.
ఇటీవల తనపై ఒక ఏసీపీ స్థాయి అధికారి నిఘా పెట్టినట్లు సమాచారం అందిందని అర్వింద్ ఆరోపించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాల మేరకే ఈ నిఘా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ఎలాంటి అధికారి లేదా బృందాన్ని తన కదలికలను పర్యవేక్షించేందుకు నియమించలేదని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.





























