[t4b-ticker]

విదేశీ వర్సిటీల మాటలు వద్దు.. ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించండి: బండి సంజయ్

ప్రతిపక్షం, ఆగస్టు 25: తెలంగాణలోని విద్యార్థులు, కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ముందుగా రాష్ట్రంలోని కళాశాలలను, విద్యార్థులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గత ఐదేళ్లుగా దాదాపు రూ.15 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని బండి సంజయ్ ఆరోపించారు. బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో అనేక కళాశాలలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కొన్ని కాలేజీలు మూసివేత దిశగా వెళ్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితి వల్ల ముఖ్యంగా దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

విద్యార్థులు, కళాశాలలకు మద్దతుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు చేపట్టిన ‘ఫీజు బకాయి–బీజేపీ లడాయి’ దీక్షకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని బండి సంజయ్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల ఫీజుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని ఆయన కోరారు. బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థులకు న్యాయం జరిగే వరకు రాంచందర్‌రావు నాయకత్వంలో బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News