ప్రతిపక్షం, ఆగస్టు 26: హార్ముజ్ జలసంధిపై తన నియంత్రణను కొనసాగించేందుకు ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన ‘మహా రూస్’ నౌకతో పాటు మొత్తం 45 నౌకలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్లు సమాచారం. ఇరాన్ నిర్దేశించిన సముద్ర మార్గాలను పాటించకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్న నౌకలపై నియంత్రణను మరింత కఠినతరం చేసే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల్లో అధిక శాతం ఒమన్ తీరానికి సమీపంలోని ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. అమెరికా నౌకాదళం భద్రత కల్పిస్తుండటంతో ఈ మార్గంలో నౌకల రాకపోకలు పెరిగినట్లు సమాచారం. దీంతో హార్ముజ్‌పై తన ప్రభావం తగ్గుతోందన్న భావనతో ఇరాన్ మరింత కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది.
బ్లాక్‌లిస్ట్‌లో భారత్‌కు చెందిన ‘మహా రూస్’తో పాటు పాకిస్థాన్ జెండాతో ప్రయాణించే ‘మర్దాన్’ అనే ముడి చమురు రవాణా నౌక కూడా ఉన్నట్లు సమాచారం. ఇరాన్ నిర్దేశించిన మార్గాలను పాటించని నౌకలపై జరిమానాలు విధించడం, అవసరమైతే వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని సంబంధిత అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన నౌకలకు భవిష్యత్తులో హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు అనుమతి ఉండదని సమాచారం. నిషేధం తొలగించుకోవాలనుకునే నౌకల యజమానులు ఇరాన్ అధికారులకు అధికారికంగా వివరణ సమర్పించి అనుమతి పొందాల్సి ఉంటుంది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిపై తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బ్లాక్‌లిస్ట్ చేసిన 45 నౌకల్లో కనీసం 14 నౌకలు గతంలో జలసంధి ప్రాంతంలో జరిగిన వివిధ దాడుల్లో దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్‌లో నౌకల రాకపోకలపై ఉత్కంఠ మరింత పెరిగింది.
హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు భద్రత, పర్యావరణ సేవలు, ఇంధన సరఫరా, బీమా వంటి సేవల కోసం రుసుములు వసూలు చేసే ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంటరీ కమిషన్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తే అంతర్జాతీయ నౌకాయాన రంగంపై, ముఖ్యంగా చమురు రవాణాపై ప్రభావం చూపే అవకాశం ఉంది.





























