[t4b-ticker]

Gen Z ఎఫెక్ట్.. భారీగా పెరిగిన మోదీ ఇన్‌స్టా ఫీడ్

ప్రతిపక్షం, ఆగస్టు 26: జెన్ జెడ్ తరం ప్రభావంతో రాజకీయ పార్టీల ప్రచారంలో సామాజిక మాధ్యమాల ప్రాధాన్యం గణనీయంగా పెరుగుతోంది. జూలై 20 తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఇన్‌స్టాగ్రామ్‌ను మరింతగా వినియోగిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా నేతల పోస్టులకు వస్తున్న స్పందన, వీక్షణలు, వ్యాఖ్యలు, పంచుకునే వారి సంఖ్యలో భారీ పెరుగుదల నమోదైనట్లు సమాచారం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులకు సగటు స్పందన జూలై 20కి ముందు సుమారు 11.3 లక్షలుగా ఉండగా, ఆ తర్వాత 46.3 లక్షలకు చేరింది. దీంతో ఆయన పోస్టుల సగటు స్పందన ఏకంగా 289.9 శాతం పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. యువతలో సామాజిక మాధ్యమాల వినియోగం పెరగడం, రాజకీయ అంశాలపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చర్చలు ఎక్కువ కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోస్టులకు కూడా గణనీయమైన స్పందన లభిస్తోంది. ఆయన పోస్టులకు సగటు స్పందన గతంలో సుమారు 1.52 లక్షలు ఉండగా, జూలై 20 తర్వాత 4.26 లక్షలకు పెరిగింది. ఇది దాదాపు 180.7 శాతం పెరుగుదలగా నమోదైంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాన నేతల తర్వాత కాంగ్రెస్‌కు చెందిన పోస్టులకు సగటున సుమారు 72 వేల స్పందనలు, భారతీయ జనతా పార్టీ పోస్టులకు సుమారు 34 వేల స్పందనలు వస్తున్నట్లు సమాచారం. దీంతో సంప్రదాయ ప్రచార పద్ధతులతో పాటు సామాజిక మాధ్యమాలను రాజకీయ పార్టీలు మరింత కీలకమైన వేదికగా మార్చుకుంటున్నాయి.

జెన్ జెడ్ యువత రాజకీయ అంశాలను తెలుసుకోవడం, అభిప్రాయాలను పంచుకోవడం, నేతల ప్రసంగాలు, ప్రచార కార్యక్రమాలను అనుసరించడం ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారానే జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో రాజకీయ ప్రచారంలో ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Spread the love

Related News

Latest News