ప్రతిపక్షం, ఆగస్టు 26: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)లో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని తల్లి, శిశు ఆరోగ్య విభాగం మూడో అంతస్తులో ఉన్న నవజాత శిశువుల విభాగంలో మంటలు చెలరేగడంతో 14 మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మరో శిశువును సిబ్బంది సురక్షితంగా రక్షించారు.
అధికారుల సమాచారం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 6.54 గంటల సమయంలో అగ్నిప్రమాదంపై సమాచారం అందింది. వెంటనే ఆరు అగ్నిమాపక వాహనాలు, నాలుగు అంబులెన్సులతో సహాయక బృందాలు ఆసుపత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ప్రమాద సమయంలో నర్సరీలో 15 మంది నవజాత శిశువులు ఉన్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. వారిలో ఒకరిని వైద్యుడు రక్షించగా, మిగిలిన 14 మంది మృతి చెందినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది.
ప్రాథమిక దర్యాప్తులో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలో తలెత్తిన లోపమే అగ్నిప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. నర్సరీలోని ఏసీ కంప్రెసర్‌లో పేలుడు సంభవించిన అనంతరం మంటలు చెలరేగినట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది పూర్తి దర్యాప్తు తర్వాతే తేలనుంది.
మంటలు చెలరేగిన సమయంలో పసికందులు ఇంక్యుబేటర్లలో చికిత్స పొందుతుండటంతో వారిని వెంటనే బయటకు తరలించడం అత్యంత క్లిష్టంగా మారింది. ఆక్సిజన్ సదుపాయాలు ఉండటంతో మంటలు మరింత వేగంగా వ్యాపించి ఉండొచ్చని పాకిస్థాన్ ఆరోగ్య మంత్రి ముస్తఫా కమాల్ తెలిపారు. ఘటన అనంతరం ఆసుపత్రి వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి తక్షణ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదానికి బాధ్యులెవరైనా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఆసుపత్రిలో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, అత్యవసర సమయంలో శిశువులను తరలించేందుకు ఉన్న సదుపాయాలపై విచారణ జరగనుంది.
ఒకే ఘటనలో పెద్ద సంఖ్యలో నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆసుపత్రుల్లో, ముఖ్యంగా నవజాత శిశువుల విభాగాల్లో అగ్నిప్రమాదాల నివారణకు మరింత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.





























