ప్రతిపక్షం, ఆగస్టు 26: హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా.. అనంతరం వాటి ద్వారా బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఫోన్ చోరీతో పాటు సైబర్ మోసాన్ని కలిపి చేస్తున్న ఈ తరహా నేరాన్ని పోలీసులు సరికొత్త ‘హైబ్రిడ్ ఫ్రాడ్’గా గుర్తిస్తున్నారు.
ముఠా సభ్యులు ముందుగా రద్దీ ప్రాంతాల్లో వృద్ధులను గుర్తించి వారిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వారు సెల్‌ఫోన్‌ను అన్‌లాక్ చేసే సమయంలో ప్యాటర్న్, పిన్ లేదా పాస్‌వర్డ్‌ను గమనించి గుర్తుపెట్టుకుంటున్నారు. అనంతరం అదును చూసుకుని మొబైల్ ఫోన్‌ను చోరీ చేస్తున్నారు. ఫోన్ తమ చేతికి చిక్కిన వెంటనే అన్‌లాక్ చేసి అందులోని బ్యాంకింగ్ వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఫోన్‌లో మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించి బాధితుల ఖాతాల నుంచి డబ్బును బదిలీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. ఫోన్ అన్‌లాక్ పిన్ ముందుగానే తెలుసుకోవడంతో పాటు బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన వివరాలు ఫోన్‌లోనే ఉండటాన్ని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
సాధారణంగా సెల్‌ఫోన్ పోయిన వెంటనే బాధితులు సిమ్‌ను బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే అప్పటికే నేరగాళ్లు ఫోన్‌ను అన్‌లాక్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ చేసే అవకాశం ఉండటంతో భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వృద్ధులు ప్రయాణ సమయంలో ఫోన్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు, అన్‌లాక్ చేసే పద్ధతిని ఇతరులకు కనిపించేలా చేస్తున్నారా అనే అంశాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.
ఈ తరహా నేరాల్లో సెల్‌ఫోన్ చోరీ ఒక్కటే లక్ష్యం కాదని, ఫోన్‌లో ఉన్న ఆర్థిక సమాచారాన్ని ఉపయోగించి ఖాతాలను ఖాళీ చేయడమే అసలు ఉద్దేశమని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రజలు రద్దీ ప్రాంతాల్లో ఫోన్‌ను ఉపయోగించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ లేదా యూపీఐ సేవలకు సంబంధించిన పిన్, పాస్‌వర్డ్‌లను ఫోన్ అన్‌లాక్ పిన్‌తో ఒకేలా ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు.
సెల్‌ఫోన్ చోరీకి గురైన వెంటనే సిమ్‌ను నిలిపివేయడంతో పాటు బ్యాంకు ఖాతాలు, యూపీఐ సేవలను తక్షణమే నిలిపివేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించి, సైబర్ నేరాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.





























