[t4b-ticker]

డీ-మార్ట్‌లో సరకులు కొంటున్నారా?

ప్రతిపక్షం, ఆగస్టు 25: డీమార్ట్‌లో వస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులు బిల్లింగ్ సమయంలో ధరలను ఒకసారి పరిశీలించుకోవాలన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. డిస్‌ప్లేలో చూపించిన ధర కంటే బిల్లింగ్ సమయంలో ఎక్కువ మొత్తం వసూలు చేశారంటూ ఓ మహిళ చేసిన ఆరోపణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ మహిళ డీమార్ట్‌లో షాపింగ్ చేసిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. కిలో చక్కెరపై ఆఫర్ ధర రూ.60.50గా డిస్‌ప్లేలో కనిపించడంతో ఆమె దాన్ని కొనుగోలు చేశారు. అయితే బిల్లింగ్ సమయంలో అదే చక్కెరకు రూ.67 వసూలు చేసినట్లు ఆమె గుర్తించారు.

దీంతో బిల్లింగ్ కౌంటర్ వద్ద సిబ్బందిని ఆమె ప్రశ్నించారు. డిస్‌ప్లేలో ఒక ధర చూపించి, బిల్లులో మరో ధర ఎలా ఉంటుందని నిలదీశారు. ప్రతి వినియోగదారుడు బిల్లు మొత్తాన్ని, కొనుగోలు చేసిన వస్తువుల ధరలను పూర్తిగా పరిశీలించకపోవచ్చని, ఈ విధంగా ఎంతమంది నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందించిన కొందరు నెటిజన్లు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేశారు. మరికొందరు కొనుగోలు చేసిన తర్వాత బిల్లును తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.

అయితే ఈ ఘటనపై సంబంధిత సంస్థ నుంచి అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది. వస్తువులపై ప్రదర్శించిన ధర, బిల్లులో నమోదైన ధరల్లో తేడా ఉంటే వినియోగదారులు వెంటనే సిబ్బందిని ప్రశ్నించాలని, అవసరమైతే సంబంధిత వినియోగదారుల ఫిర్యాదు వ్యవస్థను ఆశ్రయించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love

Related News

Latest News