ప్రతిపక్షం, ఆగస్టు 25: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి, తెలంగాణకు గుర్తింపు తీసుకువచ్చినందుకు వారిని ప్రశంసించారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారితో మాట్లాడి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సాధించిన విజయాన్ని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
మహిళల డబుల్స్‌లో కఠినమైన పోటీని ఎదుర్కొని కాంస్య పతకం సాధించడం గొప్ప విజయమని సీఎం పేర్కొన్నారు. భారత బ్యాడ్మింటన్‌కు ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావడంలో యువ క్రీడాకారిణుల పాత్ర ప్రశంసనీయమన్నారు. క్రీడల్లో యువతకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీవీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీల విజయంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్న తెలంగాణ క్రీడాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.





























