ప్రతిపక్షం, సెప్టెంబర్ 07: తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు నుంచి మూడు గంటల్లో ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ఆయా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
ఇక తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ పలు ప్రాంతాల్లో ఇవాళ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం సమయంలో అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారీ వర్షం కురిసే ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచే అవకాశం ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలి. తాజా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.





























