కొండా సురేఖ ఫిర్యాదుపై కడియం శ్రీహరి స్పందన.. ‘ప్రోటోకాల్ ఉల్లంఘించలేదు’

ప్రతిపక్షం, జూలై 08: మంత్రి కొండా సురేఖ తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. తాను ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడలేదని, దేవాదాయ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించలేదని స్పష్టం చేశారు.

ఆలయాలకు సంబంధించిన సమస్యలను మాత్రమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, సమీక్ష నిర్వహించే అధికారం తనకు లేదనే విషయం తనకూ తెలుసని కడియం శ్రీహరి పేర్కొన్నారు. తాను నిబంధనలకు లోబడే వ్యవహరించానని, ఈ విషయంలో ఎవరికీ ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అంశాలపై కడియం అధికారులతో సమావేశం నిర్వహించడంపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో కడియం శ్రీహరి, కొండా సురేఖ మధ్య మరోసారి విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

Spread the love

Related News

Latest News