ప్రతిపక్షం, షాద్‌నగర్: అదృష్టవశాత్తు గారెల బుట్టిలో రేవంత్ పడ్డారు.. అదృష్టం కొద్ది వచ్చిన ముఖ్యమంత్రి పదవిని రాష్ట్రాభివృద్ధికోసం పాటు పడాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డి.కె. అరుణ కోరారు. పాలమూరు ప్రజలకు తాగునీరు, సాగునీటి గోస నుంచి విముక్తి చేయాలని ‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు’ కోసం రాయలసీమ నాయకులతో పోరాటం చేశానని, దీని కోసం నిరసనలు, ధర్నాలు, ఉపవాస దీక్షలు, పోరాటాలు చేసి జీవోను తీసుకొచ్చింది తానేనని ఆమె తెలిపారు.
నాడు కదం తొక్కకుంటే ఈనాడు పాలమూరు ప్రాజెక్టు ఎక్కడిదని? ప్రశ్నించారు. శుక్రవారంనాడు సంకల్ప్ యాత్రలో భాగంగా షాద్‌నగర్‌కు వచ్చిన ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో మాటాలడుతూ.. తెలంగాణలో అభివృద్ధి జరగాలన్నా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని, రాష్ట్రంలో పాలమూరులో అన్ని సీట్లు బీజేపీవే అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో బిజెపి అధికారంలో లేనప్పటికీ ఈ రాష్ట్ర అభివృద్ది కోసం సుమారు 10 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని వివరించారు.
ప్రధానిగా మోడీ రెండు పర్యాయాలు పనిచేశారని మూడోసారి కూడా ఆయన గెలుపు ఖాయమని ఆమె స్పష్టం చేశారు. 2047 వరకు ఒక ముందస్తు ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆమె అన్నారు. రాబోయే 23 ఏళ్లలో అనేక ప్రణాళికలతో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడతామని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి దేశవ్యాప్తంగా పరిష్కారానికి నోచుకుని ఎన్నో కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందని వివరించారు. కోవిడ్ సమయంలో అన్ని దేశాల కన్నా ముందుగా పేద ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేశారని గుర్తు చేశారు.
జి 20 దేశాల నిర్వహణ ప్రపంచవ్యాప్తంగా దేశానికి మంచి పేరు తెచ్చారని అన్నారు. అయోధ్య మందిర నిర్మాణం అదేవిధంగా కాశ్మీర్ ఆర్టికల్, రైల్వే సేవలు, జాతీయ రహదారుల నిర్మాణం, ఆత్మ నిర్భల్ లాంటి ఎన్నో కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే ఒక ఆదర్శవంత దేశంగా దూసుకుపోయిందని అన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు రైతులు నిరుద్యోగులు కులవృత్తిదారులకు యువతకు ఎస్సీ ఎస్టీ, బీసీ అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు సమానంగా పంచుతున్న ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని అన్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధి పరుగులు పెట్టాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉండాలని అన్నారు. 2017 లో పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి కోసం కోట్లాది నిధులతో కృషి చేసింది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు.
బీఆర్ఎస్ తో పొత్తు ఉండదు..
బీఆర్ఎస్ పార్టీతో బిజెపికి అసలు పోత్తే ఉండదని డీకే అరుణ స్పష్టం చేశారు. గత పది ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు కెసిఆర్ ఒరగబెట్టింది ఏమీలేదని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అంటూ బీఆర్ఎస్ విమర్శలు అందుకుందని వారి ప్రభుత్వం పోయాక ఆ బాధ్యతలు ఇప్పుడూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోస్తుందని అన్నారు. అహర్నిశలు ఈ రెండు పార్టీలు కలిసి కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూనే వస్తున్నారని అన్నారు. రాజకీయం చేస్తే తెలుసుకొని చేయాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులను విమర్శించారు.
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని దీంతో రేవంత్ రెడ్డి బూరెల బుట్టలో పడ్డాడని, ఇక బుట్టిలో గారెలు తినుకుంటూ కూర్చోవద్దని ప్రజల మంచి చెడ్డలు చూడాలని ఆమె హితబోధ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి కెసిఆర్, రేవంత్ రెడ్డి ఒకే రకమైన విమర్శల గేమ్ ఆడుతున్నారని ఆమె అన్నారు. ఈ పొలిటికల్ డ్రామాలు ముందు బంద్ చేయాలని ఆమె సూచించారు. చిత్తశుద్ధి ఉంటే పాలమూరు ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరిట ఇప్పటివరకు షాద్ నగర్ నియోజకవర్గంలో లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణం ఎందుకు జరగలేదో ప్రజలు ప్రశ్నించాలని సూచించారు.
నన్ను విమర్శించే స్థాయి నేతలకు లేదు..
నన్ను విమర్శించే స్థాయి పాలమూరు జిల్లాలో ఏ నాయకుడికి లేదని, ముందు వారి అర్హత తెలుసుకొని మాట్లాడాలని డీకే అరుణ ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఏదో తనను పొలిటికల్ గా టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో అవాస్తవాలు మాట్లాడుతున్నారని తనను విమర్శించే నైతిక హక్కు ఏ నాయకుడికి లేదని ఆమె అన్నారు. చిల్లర రాజకీయాలు, చీప్ పాలిట్రిక్స్ మానేసి ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఓ కల అని ఆమె అన్నారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు సాధిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడా అంటూ “డీకే అరుణ” ఎద్దేవా చేశారు, ఈ సమావేశంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, పార్టీ సీనియర్‌నేత నాగురావ్ నామోజీ, పార్టీ నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, పవన్ కుమార్, కేవీఎల్ఎన్ రాజు, దేపల్లి అశోక్ గౌడ్, కక్కునూరు వెంకటేష్ గుప్తా, నర్సింహా గౌడ్ తదితరులు హాజయ్యారు.