ప్రతిపక్షం, జూలై 07: తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ప్రముఖ టూరిజం గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని సహజ, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. కొత్త టూరిజం డెస్టినేషన్ల గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటకులను ఆకర్షించే ప్రత్యేక ప్రాజెక్టులపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ పర్యాటక రంగానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో గ్రాండ్ టూరిజం కార్నివాల్ నిర్వహణకు భారీ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర సాంస్కృతిక వైభవం, ప్రకృతి అందాలు, పర్యాటక అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని సూచించారు.
అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులను ఎకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ప్రకృతి పరిరక్షణకు భంగం కలగకుండా పర్యాటకులను ఆకర్షించే విధంగా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు.
సోమశిల ప్రాంతంలో ఉన్న సుమారు 1,600 ఎకరాల భూమి వినియోగంపై సమగ్ర అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆ ప్రాంతాన్ని పర్యాటక, వినోద, పెట్టుబడి కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించాలని నిర్ణయించారు. దేశీయ, విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించి టూరిజం రంగంలో కొత్త అవకాశాలను సృష్టించాలని మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలోని పర్యాటక ఆస్తుల నిర్వహణ, అభివృద్ధిపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి రెండు నుంచి మూడు రోజుల్లో సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వేగంగా చర్యలు చేపట్టి తెలంగాణను దేశంలోనే ప్రముఖ పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

















