ప్రతిపక్షం, జూలై 02: ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం 36 గంటలపాటు నిరంతరంగా శ్రమించి ఒకే రోగికి ఐదు అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్‌కు జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి దేశంలోనే అరుదైన వైద్య ఘనతను సాధించారని సీఎం పేర్కొన్నారు.
జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ఉస్మానియా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది వైద్య రంగానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రభుత్వ వైద్య సంస్థల్లోనూ అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని ఈ విజయం మరోసారి నిరూపించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

















