ప్రతిపక్షం, కరీంనగర్ : కరీంనగర్ లో భూమాఫియాకు పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా జైలు పాలవుతున్నారు. భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించిన కరీంనగర్ సీపీ అభిషేకం మహంతి అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతున్నారు. కొందరు నగరం విడిచి పారిపోగా.. మరికొందరు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
తాజాగా గురువారం భూకబ్జాలు, నకిలీ డాక్యుమెంట్ల తయారీకి పాల్పడ్డ మరో ముగ్గురు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రధాన అనుచరులు, బీఆర్ఎస్ నాయకులను ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిసాన్ నగర్ కు చెందిన కార్పొరేటర్ ఎడ్ల సరిత భర్త అశోక్, తీగలగుట్టపల్లికి చెందిన కార్పొరేటర్ తుల రాజేశ్వరి భర్త తుల బాలయ్య, కార్పొరేటర్ కాశెట్టి లావణ్య భర్త శ్రీనివాస్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు సమాచారం.