ప్రతిపక్షం, జూన్ 25: మాజీ ఎంపీ వినోద్ కుమారుడి వివాహ వేడుకలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఒకప్పుడు ఒకే రాజకీయ వేదికపై కలిసి పనిచేసి, ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్న కేటీఆర్, ఈటల రాజేందర్ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఇద్దరూ ఆలింగనం చేసుకుని పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
వేడుకలో కేటీఆర్ తన కుమారుడిని పిలిచి ఈటల రాజేందర్‌తో మాట్లాడించగా, ఇద్దరూ కొంతసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈటల భుజంపై చేయి వేసి కేటీఆర్ మాట్లాడటం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రాజకీయాల్లో పోటీలు, విభేదాలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత సంబంధాలు వేరని ఈ సంఘటన మరోసారి చాటిచెప్పిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఉండరనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
వివాహ వేడుకలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొనగా, కేటీఆర్–ఈటల ఆత్మీయ పలకరింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

















