ప్రతిపక్షం, జూన్ 02: తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తుందని, భవిష్యత్ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై గళమెత్తుతామని, ప్రజల మధ్యకు వెళ్లి పోరాటాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. “ఇప్పటివరకు ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు. కానీ నా తెలంగాణపై ప్రేమను శంకిస్తున్నందున ఇప్పుడే చెబుతున్నా.. తెలంగాణలో జనసేన తిరుగుతుంది. నేనే స్వయంగా ప్రజల్లోకి వస్తాను” అని అన్నారు.
రాష్ట్రంలో జరిగే ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటామని, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. “తెలంగాణ దేశంలో అంతర్భాగం. ఇక్కడికి రావొద్దని ఎవరైనా చెప్పినా అంగీకరించం. ప్రజాస్వామ్య హక్కుల కోసం నిలబడతాం” అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో పార్టీ విస్తరణ, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై త్వరలో మరింత స్పష్టత ఇస్తామని జనసేన అధినేత వెల్లడించారు.

















