ప్రతిపక్షం, జూలై 14: ఇథనాల్ మిశ్రమ ఇంధనం (E20) వినియోగంతో వాహనాల మైలేజ్ తగ్గుతోందనే చర్చల మధ్య కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా వాహనదారులు స్వయంగా మైలేజ్‌ను ఖచ్చితంగా నిర్ధారించలేరని, కంపెనీ గుర్తింపు పొందిన ప్రత్యేక పరికరాల ద్వారానే అసలు మైలేజ్‌ను పరీక్షించవచ్చని తెలిపారు.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గడ్కరీని, “సిటీలో నా కారు మైలేజ్ 11 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్లకు పడిపోయింది” అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా, అందుకు ఆయన స్పందించారు. “మీరు గానీ, నేను గానీ మైలేజ్‌ను శాస్త్రీయంగా కొలవలేం. కంపెనీ అధీకృత డీలర్ల వద్ద ఉండే ప్రత్యేక యంత్రాల ద్వారా మాత్రమే ఖచ్చితమైన మైలేజ్ వివరాలు తెలుసుకోవచ్చు” అని చెప్పారు.
ఇథనాల్ మిశ్రమ ఇంధనం కారణంగా హైవేలపై కొంత మేర మైలేజ్‌లో తేడా ఉండే అవకాశం ఉందని అంగీకరించిన గడ్కరీ, పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇథనాల్ మిశ్రమ ఇంధనం, సాధారణ పెట్రోల్‌తో దాదాపు ఒకే స్థాయిలో మైలేజ్ లభిస్తుందని వివరించారు.
దేశంలో ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పెట్రోల్ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే E20 ఇంధనంతో మైలేజ్ తగ్గుతోందంటూ వస్తున్న అభ్యంతరాలపై వాహనదారుల్లో చర్చ కొనసాగుతున్న వేళ గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

















