కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. భద్రతా లోపాలపై యాజమాన్యంపై కేసు

ప్రతిపక్షం, జూలై 14: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రముఖ లులు మాల్‌లో గన్‌తో ఓ వ్యక్తి ప్రవేశించడం కలకలం రేపింది. మాల్ పార్కింగ్ ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణ సందర్భంగా పాతబస్తీకి చెందిన సిద్ధిఖీ అనే వ్యక్తి వద్ద తుపాకీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా, అది చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌తో కలిగిన గన్ అని తేలింది. దీంతో ఆయుధం అక్రమం కాదని పోలీసులు నిర్ధారించారు.

అయితే, తుపాకీతో వచ్చిన వ్యక్తిని ఎలాంటి సమగ్ర భద్రతా తనిఖీలు నిర్వహించకుండా మాల్‌లోకి అనుమతించడం తీవ్ర నిర్లక్ష్యంగా భావించిన పోలీసులు లులు మాల్ భద్రతా వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా నిబంధనలను పాటించడంలో వైఫల్యం చోటుచేసుకున్న నేపథ్యంలో మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రజలు అధిక సంఖ్యలో సందర్శించే వాణిజ్య సముదాయాల్లో భద్రతా తనిఖీలు మరింత కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచించారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Spread the love

Related News

Latest News