సేవ, సంస్కారం, సమాజ బాధ్యత కలిసిన ఒక సేవా కుటుంబమే వాసవి క్లబ్
సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనే ఆలోచన గొప్పది.
వాసవి క్లబ్ సేవల్లో వాసవి వనితా సేవలో స్ఫూర్తి దాయకం..
వాసవి క్లబ్ ప్రాంతీయ సదస్సు అవార్డు ల ప్రధానోత్సవం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, సెప్టెంబర్ 27: “సేవ చేసిన వారిని గుర్తించడం కూడా ఒక సేవే. మంచి చేసిన వారిని ప్రోత్సహిస్తే… మరింత మందికి మంచి చేయాలనే స్ఫూర్తి కలుగుతుంది.ఆ గొప్ప బాధ్యతను వాసవి క్లబ్ నిరంతరం నిర్వహించడం సంతోషకరం” అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సమాజంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఆదివారం సిద్ధిపేటలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమానికి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..” వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ఎంతో అభినందనీయం. వాసవి క్లబ్ కేవలం సంస్థ కాదు. సేవ, సంస్కారం, సమాజ బాధ్యత కలిసిన ఒక సేవా కుటుంబం.వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర, జాతీయ స్థాయి లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందిస్తున్నారు. పేద విద్యార్థుల విద్యకు సహాయం, పేదలకు వైద్య సహాయం, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం, పర్యావరణ పరిరక్షణకు కృషి, మహిళా సాధికారతను ప్రోత్సహించడం వంటి వాటి ద్వారా వాసవీ క్లబ్ సమాజానికి అండగా నిలుస్తోంది.
ఆర్యవైశ్య సమాజం అనగానే శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు గుర్తుకు వస్తారు. అమ్మవారి ఆదర్శాలను అనుసరిస్తూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం నిజమైన భక్తి అని భావిస్తున్నాను. సంపాదించడం గొప్ప విషయమే. సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచన ఇంకా గొప్పది. మన దగ్గర ఎంత సంపద ఉందన్నది కాదు.మన వల్ల ఎంతమంది జీవితాల్లో వెలుగు వచ్చింది అన్నదే మన జీవితానికి నిజమైన విలువ. పురస్కారం అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు. ఈ పురస్కారం మీ సేవకు లభించిన గుర్తింపు మాత్రమే కాదు. మీపై మరింత బాధ్యతనూ పెంచుతుంది. మీరు చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి మరో పదిమంది స్ఫూర్తి పొందాలి. వాళ్లు మరో వంద మందికి సహాయం చేయాలి. అలా సేవ ఒక గొలుసులా సమాజమంతా విస్తరించాలి. యువత జీవితంలో ఎదగాలి… సంపాదించాలి… ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. అదే సమయంలో మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా మర్చిపోకూడదు. మన ఊరిలో ఒక పేద విద్యార్థి చదువు ఆగిపోకుండా చేయ గలిగితే, ఒక నిరుపేద కుటుంబానికి వైద్య సహాయం అందించగలిగితే, అవసరంలో ఉన్న ఒక కుటుంబానికి అండగా నిలబడ గలిగితే అదే నిజమైన సామాజిక సేవ.ఇలాంటి సేవా భావాన్ని యువతలో పెంపొందించే బాధ్యతను వాసవి క్లబ్ మరింత విస్తృతంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. సామాజిక సేవా సంస్థల సహకారం తోడైతే సమాజంలో మరింత వేగంగా మార్పు తీసుకు రాగలం. రాబోయే రోజుల్లో కూడా విద్య, వైద్యం, మహిళా సాధికారత, యువత ఉపాధి, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో వాసవి క్లబ్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టి వేలాది కుటుంబాలకు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
































