ప్రతిపక్షం, జూలై 24: పెళ్లిళ్లలో అధిక ఖర్చులపై ఛార్టర్డ్ అకౌంటెంట్ మీనా గోయల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. బంధువులను, అతిథులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో లక్షల రూపాయలు ఖర్చు చేయడం కంటే, ఆ డబ్బును భవిష్యత్తు కోసం దాచుకోవడం మంచిదని ఆమె సూచించారు.
తన పోస్ట్‌లో ఓ సాధారణ పెళ్లి కోసం అయ్యే ఖర్చులను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆహార ఏర్పాట్లకు రూ.6 లక్షలు, వేదికకు రూ.5 లక్షలు, అలంకరణకు రూ.3 లక్షలు, ఫొటోగ్రఫీకి రూ.2 లక్షలు, వినోద కార్యక్రమాలకు రూ.2 లక్షలు, ఇతర ఖర్చులకు మరో రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వివరించారు.
అయితే ఈ ఖర్చు అంతా కేవలం రెండు రోజుల వేడుకకే పరిమితమవుతుందని ఆమె గుర్తుచేశారు. కార్యక్రమం పూర్తయ్యాక వేదికను ఖాళీ చేయాల్సి వస్తుందని, అలంకరణ తొలగిపోతుందని, వడ్డించిన భోజనం ముగిసిపోతుందని, అతిథులు కూడా మరో కార్యక్రమానికి వెళ్లిపోతారని పేర్కొన్నారు. కానీ ఆ ఖర్చు భారం మాత్రం పెళ్లి చేసుకున్న కుటుంబంపైనే మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.
అనవసర ఆర్భాటాల కోసం అప్పులు చేయడం కన్నా, అదే డబ్బును కొత్త దంపతుల భవిష్యత్తు, ఇల్లు, పెట్టుబడులు లేదా అత్యవసర అవసరాల కోసం వినియోగించడం ఎంతో ప్రయోజనకరమని మీనా గోయల్ సూచించారు. ఆమె చేసిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో విస్తృత స్పందన లభిస్తుండగా, చాలామంది ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు పెళ్లి జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక కాబట్టి ఖర్చు చేయడంలో తప్పులేదని వ్యాఖ్యానిస్తున్నారు.

















