ప్రతిపక్షం, సెప్టెంబర్ 02: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై పార్టీ అధిష్ఠానం తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా అన్ని వర్గాలతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, కొండా సురేఖకు సంబంధించిన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు, పార్టీ నేతల మధ్య నెలకొన్న పరిస్థితులు, సీనియర్ నాయకుల అభిప్రాయాలపై చర్చించే అవకాశం ఉంది.
కొండా సురేఖ వ్యవహారంపై ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతలు తమ అభిప్రాయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో వర్గం నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిశీలించి, అన్ని అంశాలను బేరీజు వేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.
కేసీ వేణుగోపాల్‌తో జరగనున్న సమావేశం అనంతరం ఈ వ్యవహారంలో పార్టీ తదుపరి కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.





























