ప్రతిపక్షం, సెప్టెంబర్ 01: ‘పుష్ప-2’ సినిమాలో చీర కట్టుకుని నటించడం తన కెరీర్‌లో చేసిన అత్యంత సాహసోపేతమైన పనుల్లో ఒకటని అల్లు అర్జున్ అన్నారు. ఫోర్బ్స్ ఇండియా ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ‘పుష్ప’ ఫ్రాంచైజీ ప్రభావం, ప్రేక్షకుల అంచనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘పుష్ప’ సాధించిన విజయం తనలో మరింత పెద్ద స్థాయిలో సినిమాలు చేయాలనే ఆలోచనను పెంచిందని అల్లు అర్జున్ తెలిపారు. భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాలనే స్ఫూర్తిని ఆ చిత్రం విజయంతో పొందినట్లు చెప్పారు. ముఖ్యంగా ‘పుష్ప-2’లో చీరకట్టుకుని నటించడం విషయంలో తాను ఎలాంటి వెనుకడుగు వేయలేదని, అదే తాను చేసిన ‘ఆల్ఫా థింగ్’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచులు, అంచనాలు పూర్తిగా మారిపోయాయని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు. సాధారణ స్థాయి కంటెంట్‌ను ప్రేక్షకులు ఎక్కువ కాలం ఆదరించే పరిస్థితి లేదని, ప్రతి సినిమా విషయంలోనూ కొత్తదనం, నాణ్యత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతిని అందించేలా సినిమాలు రూపొందించడం నటులు, దర్శకులు, నిర్మాతల బాధ్యత అని పేర్కొన్నారు.
‘పుష్ప’ చిత్రానికి దేశవ్యాప్తంగా వచ్చిన స్పందన తనపై మరింత బాధ్యతను పెంచిందని అల్లు అర్జున్ తెలిపారు. ఒక సినిమా విజయాన్ని ఆస్వాదించడం కంటే.. ఆ విజయాన్ని మించిన స్థాయిలో తదుపరి చిత్రాన్ని అందించేందుకు కష్టపడటమే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు అట్లీతో కలిసి ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. భారీ స్థాయి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ ఎంచుకుంటున్న కథలు, దర్శకులతో చేస్తున్న ప్రయోగాలు ఆయన కెరీర్‌ను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్తున్నాయి.





























