ప్రతిపక్షం, నవంబర్ 26: భారతీయ వస్తువులపై 25 శాతం వరకు అదనపు దిగుమతి సుంకాలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద చేపట్టిన దర్యాప్తు అనంతరం వాషింగ్టన్ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. భారత తయారీ రంగ విధానాలు అధిక ఉత్పత్తి సామర్థ్యానికి కారణమవుతున్నాయన్న అమెరికా ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. దేశంలో ఏ రంగంలోనూ నిర్మాణాత్మకంగా అవసరానికి మించిన ఉత్పత్తి సామర్థ్యం లేదని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (యూఎస్టీఆర్) జారీ చేసిన నోటీసును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ దర్యాప్తు ప్రక్రియ మొత్తం భారత్ నిర్మాణాత్మకంగా సహకరించిందని తెలిపింది. విచారణ సందర్భంగా వాణిజ్య శాఖ సమర్పించిన నివేదికల్లోనూ అమెరికా చేసిన ఆరోపణలను ఇప్పటికే ఖండించినట్లు పేర్కొంది. దేశీయ అవసరాలను తీర్చుకోవడంతోపాటు కీలకమైన ముడిసరుకుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే భారత తయారీ రంగ విస్తరణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని వివరించింది.
అయితే భారత్ తన అవసరాలకు మించి పారిశ్రామిక ఉత్పత్తులు తయారు చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. భారత మార్కెట్లోకి అమెరికా కంపెనీలు ప్రవేశించేందుకు అనేక అడ్డంకులు ఉన్నాయని, కార్మికులకు తగిన రక్షణ కల్పించడం లేదని కూడా వాషింగ్టన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ విధానాల వల్ల అమెరికా సంస్థలు నష్టపోతున్నాయని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. తక్కువ ధరలకు భారీ స్థాయిలో వస్తువులను ఎగుమతి చేయడం ద్వారా అమెరికా కంపెనీలకు పోటీని పెంచుతున్నాయని ఆరోపిస్తోంది.
భారత్‌తోపాటు చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్ సహా మొత్తం 14 ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కొత్తగా దిగుమతి సుంకాలు విధించే ప్రతిపాదనను అమెరికా తెరపైకి తెచ్చింది. ఆయా దేశాల్లో అధిక పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందన్నది అక్కడి ప్రభుత్వ వాదన. ఈ నేపథ్యంలో సెక్షన్ 301 కింద చేపట్టిన దర్యాప్తు ఆధారంగా అదనపు సుంకాల విధింపునకు మార్గం సుగమం చేసుకోవాలని అమెరికా భావిస్తోంది.
మరోవైపు, ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కోల్పోయిన ఆదాయాన్ని కొత్త సుంకాల ద్వారా భర్తీ చేసుకోవాలని ట్రంప్ యంత్రాంగం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదిత సుంకాల వివరాలను యూఎస్టీఆర్ కార్యాలయం అధికారికంగా వెల్లడించకముందే ఓ సీనియర్ అధికారి వాటి గురించి వివరించారు. అయితే ఇవి ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయని, ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంలో స్పష్టమైన గడువు నిర్ణయించలేదని ఆయన తెలిపారు.
అదనపు దిగుమతి సుంకాల వల్ల అమెరికాలో తయారీ రంగం బలోపేతమవుతుందని, పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ప్రభుత్వ ఆర్థిక లోటు తగ్గుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో హామీ ఇచ్చారు. అయితే గత ఏడాది విధించిన సుంకాల ప్రభావంతో వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికమైందని, దీనిపై అమెరికా ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైందని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సుంకాలు విధించాలంటే కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి చేయాలని డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాల విషయంలో సుంకాలను ప్రధాన అస్త్రంగా ఉపయోగించిన ట్రంప్ ప్రభుత్వం, అదే వ్యూహాన్ని కొత్త ప్రతిపాదనల్లోనూ కొనసాగించాలని చూస్తోంది. అయితే భారత తయారీ రంగ విధానాలపై అమెరికా చేసిన ఆరోపణలను కేంద్రం అంగీకరించకపోవడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు మరింత కీలకంగా మారనున్నాయి. ప్రతిపాదిత సుంకాలు అమల్లోకి వస్తే భారత ఎగుమతులపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



























