క్యూర్ పరిధిలో జనావాసాల మధ్యే ఇందిరమ్మ ఇళ్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ప్రతిపక్షం, జూలై 24, హైదరాబాద్: హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ గృహాలు జనావాసాలకు దూరంగా కాకుండా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల మధ్యలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పేదలకు ఉపాధి, రవాణా, విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ గృహాల నిర్మాణంపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల పోలీసు, రెవెన్యూ, రవాణా తదితర శాఖలకు చెందిన నిరుపయోగ ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. అలాంటి భూములను గృహ నిర్మాణానికి వినియోగించి, సంబంధిత శాఖలకు ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో భూములు కేటాయించాలని సూచించారు.

జనావాసాలకు దూరంగా ఇళ్లు కేటాయిస్తే లబ్ధిదారులు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని సీఎం పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు ఇప్పటికే నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే గృహాలు నిర్మించాలని, తద్వారా నిరుపేద కుటుంబాలు జీవనోపాధిని కోల్పోకుండా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక ప్రకారం క్యూర్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో నిరుపేదలకు ఆధునిక సదుపాయాలతో ఇందిరమ్మ గృహాలు నిర్మించనుంది. ఒక్కో ఫ్లాట్ సుమారు 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించబడుతుంది.

ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు రూ.11 లక్షలు వ్యయం అవుతుందని అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనుండగా, మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. భూమి కొనుగోలు లేదా కేటాయింపుకు సంబంధించిన మొత్తం వ్యయాన్ని మాత్రం ప్రభుత్వమే భరిస్తుంది.

తొలి దశలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్‌పురా, అంబర్‌పేట్, కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో ఈ గృహ నిర్మాణాలు చేపట్టనున్నారు.

ఈ నియోజకవర్గాల పరిధిలో వినియోగంలో లేని ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పేదలకు ఉపాధి, విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికతో ఇందిరమ్మ గృహాల నిర్మాణాన్ని చేపట్టాలని స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News