[t4b-ticker]

సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి త్వరలో ప్రారంభం.. మూసారాంబాగ్ బ్రిడ్జి పనులను మంత్రి అజారుద్దీన్ తో కలిసి పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం, ఆగస్టు 05: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర రవాణా, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర మంత్రి అజారుద్దీన్‌తో కలిసి సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి, మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, దాదాపు రూ.680 కోట్ల వ్యయంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని తెలిపారు. చంచల్‌గూడ జైలు నుంచి ఓవైసీ ఆస్పత్రి వరకు, చంపాపేట వైపు మరో లైన్‌తో ఈ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పారు.

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే సంతోష్‌నగర్, చంచల్‌గూడ, సైదాబాద్, చంపాపేట పరిసర ప్రాంతాల ప్రజలు తక్కువ సమయంలో ఇతర ప్రాంతాలకు చేరుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్ రద్దీ కూడా గణనీయంగా తగ్గుతుందని వివరించారు.

సైదాబాద్ స్టీల్ బ్రిడ్జితో పాటు మూసారాంబాగ్ బ్రిడ్జిని కూడా త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. ఈ రెండు వంతెనలతో నగర తూర్పు ప్రాంతాల్లో ప్రయాణం మరింత సులభతరం అవుతుందని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రిడ్జిల వినియోగానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

బ్రిడ్జిలకు అనుసంధానంగా అప్రోచ్ రోడ్ల విస్తరణ పనులు కూడా చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో వేగంగా పూర్తి చేయించారని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగర మౌలిక సదుపాయాలను విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కేబీఆర్ పార్క్ సమీపంలో చేపట్టిన బ్రిడ్జి పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News