పిల్లలను చదివించండి.. అదే నాకు ఇచ్చే గొప్ప బహుమతి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 02: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొత్తగూడ గ్రామంలో నిర్వహించిన లక్ష ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీ మహిళలతో ఆత్మీయంగా ముచ్చటించారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తోందని పేర్కొన్న ఆయన, ప్రతిఫలంగా తమకు ఒక్కటే కావాలని కోరారు.

“మీరు ఒక పూట ఉపవాసం ఉన్నా సరే, మీ పిల్లలను మాత్రం తప్పకుండా చదివించాలి. విద్యే మీ కుటుంబాల జీవితాలను మార్చగల శక్తి” అని మహిళలకు సీఎం సూచించారు. పిల్లలను చదివిస్తామని మహిళల నుంచి మాట కూడా తీసుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. కొత్తగూడలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించి పరిశీలించారు. గృహ నిర్మాణంలో ఉపయోగించిన నూతన సాంకేతికతను అభినందిస్తూ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో ఇల్లు లేని పేద కుటుంబం ఒక్కటి కూడా ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. గూడాలు, తండాలు, ఐటీడీఏ ప్రాంతాల్లోని ప్రతి అర్హ కుటుంబానికి ఇల్లు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే అదనంగా 21 వేల ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు.

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు అధిక రుణ పరిమితి వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను మధ్యలో ఆపకుండా పూర్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దినసరి అనసూయ సీతక్క, వివేక్ వెంకటస్వామితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News