హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆశించిన మేరకు లోక్‌సభ స్థానాలు గెలుపే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంగళవారం నాడు సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరుగుతున్న సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. తెలంగా బీజేపీ సైబర్ యోధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. అతి త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నారు. ‘ఏప్రిల్, మేలో జరిగే ఎన్నికలతో మళ్లీ అధికారంలోకి బీజేపీనే వస్తుంది. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలవాలి.. ఇదే మన లక్ష్యం. దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యం. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే’ అని షా చెప్పుకొచ్చారు.
హామీలు నెరవేరుస్తాం..!
‘కేంద్రం అమలు చేసే పథకాలను ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలి. బీఆర్ఎస్‌కు సీట్లు వచ్చినా.. లేకున్నా.. రాష్ట్రానికి ఉపయోగం లేదు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది దుర్వినియోగమే అవుతుంది.. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలి. ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్.. ప్రకటనలకే పరిమితం అయ్యింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు బీజేపీ గెలవాలి. దేశంలో ఎవరిని అడిగినా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. మేనిఫెస్టోలో హామీలన్నీ నెరవేరుస్తున్నాం. ఈ పదేళ్లలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు చేశాం. అన్ని రంగాల్లో భారత్ అభివృద్ది పథంలో పయనిస్తోంది. మూడో అదిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మారుస్తాం. అవినీతిరహిత భారత్ నిర్మాణమే మా లక్ష్యం. మోదీ.. పదేళ్లుగా అవినీతిరహిత పాలన అందించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి’ అని షా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
లిస్ట్ పంపుతా..!
‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ అజెండా ఒక్కటే. తెలంగాణలో 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ఆ మూడు అవినీతి పార్టీలే. మోదీని ఓడించడమే ఆ పార్టీల ఏకైక లక్ష్యం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ కుటుంబ పార్టీలు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు ఖాయం. తెలంగాణ సీఎంకు కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తా. కాంగ్రెస్ అవినీతిపై జవాబు చెప్పాకే బీజేపీపై విమర్శలు చేయాలి. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇటలీ వెళ్లి సేద తీరుతారు. గత పదేళ్లలో తెలంగాణకు 10వేల కోట్ల రూపాయిలు కేంద్రం సాయం చేసింది. పాకిస్తాన్ నుంచి చొరబాట్లను తిప్పికొట్టాం. పాక్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని మోదీ అంతం చేశారు. 2047 నాటికి విశ్వగురువుగా భారత్ అవుతుంది’ అని షా చెప్పుకొచ్చారు.